
అసభ్యంగా మాట్లాడటంతోనే హత్య
● ఐకేపీ ఉద్యోగి కేసులో నలుగురు నిందితులు అరెస్టు ● వివరాలు వెల్లడించిన పోలీసులు
ములుగు(గజ్వేల్): అదృశ్యమై హత్యకు గురైన ఐకేపీ ఉద్యోగి కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం ములుగు పోలీస్‌స్టేషన్‌లో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ములుగుకు చెందిన ఐకేపీ ఉద్యోగి తిగుళ్ల నెహ్రూ(35) గతనెల 28న అదృశ్యమైనట్టు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. నెహ్రూ, మజీద్‌పల్లి గ్రామానికి చెందిన గామిలిపురం మహేశ్ కలిసి చిట్‌ఫండ్ లావాదేవీలు నిర్వహించేవారు. మహేశ్‌కు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నిషారాణితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు చెందిన బంగారాన్ని వర్గల్‌లోని ఓ మైక్రో ఫైనాన్స్‌లో పెట్టి ఆ డబ్బును చిట్‌ఫండ్‌కు వినియోగించనున్నట్లు మహేశ్ జూలై 28న ఆమెతో చెప్పాడు. నిషారాణి హామీదారుగా నెహ్రూను తీసుకురావాలని చెప్పింది. దీంతో మహేశ్ ములుగు నుంచి నెహ్రూను కారులో తీసుకుని నిషారాణి ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో నిషారాణిపై నెహ్రూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో మహేశ్ అతడిపై దాడిచేశాడు. అపస్మారక స్థితిలోకెళ్లిన నెహ్రూను ఒక వైర్‌తో గొంతునులిమి హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని నిషారాణితోపాటు ఆమె తండ్రి నారదాసు కొమురయ్య సాయంతో కారులో తీసుకువెళ్లి గాగిళ్లాపూర్ సమీపంలోని ఓ చెరువులో పడేశారు. అనంతరం మహేశ్ రూ.15 వేల చిట్‌ఫండ్ డబ్బును నెహ్రూ భార్యకు అందించి అతను బాగానే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. నెహ్రూ ఫోన్‌ను ములుగు కొండపోచమ్మ కాలువలో పడేశాడు. విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు గామిలిపురం మహేశ్, అతడికి సహకరించిన నిషారాణి, ఉబ్బని వినయ్, నారదాసు కొమురయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు, టీవీఎస్ ఎక్సెల్ వాహనం, మైక్రో ఫైనాన్స్‌లోని బంగారం రుణానికి సంబంధించిన రశీదును స్వాధీనం చేసుకున్నారు.