
ఖాళీ బిందెలతో.. మహిళల నిరసన
మిరుదొడ్డిలో నిలిచిన భగీరథ తాగునీటి సరఫరా
మిరుదొడ్డి(దుబ్బాక): మూడు రోజులుగా మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పలు వార్డుల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని స్థానిక మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. చాలా రోజులుగా అరకొరగా నీరు సరఫరా అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో నీటి కోసం నానా తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.