
ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి
పట్టు పరిశ్రమ శాఖ జేడీ లత
చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టును విదేశాలకు ఎగుమతి చేయాలంటే స్థానికంగా పట్టు ఉత్పత్తి పెరగాలని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మా పట్టు మా అభిమాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్లాపూర్‌లో పట్టు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ స్థాయిలో రైతులు పట్టు సాగు చేయడానికి ముందుకు రావాలన్నారు. పట్టు సాగుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. సేంద్రియ ఎరువులతో మల్బరీ తోట సాగు చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వినోద్ కుమార్, రాఘవేందర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి రేణు శర్మ, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.