
ప్రజారోగ్యంలో పారిశుద్ధ్య కార్మికులు కీలకం
చేర్యాల(సిద్దిపేట): ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర అని అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో పర్యటించిన ఆమె స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు సెల్ప్ హెల్త్ మెటీరియల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజల అరోగ్య రక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ప్రధానమైందన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. వానాకాలం సీజన్‌లో వారానికి రెండు రోజులు డ్రై డే పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజచేశారు. మూడో వార్డు పరిధిలో చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలించిన ఆమె త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా పెద్ద చెరువు కట్టపై మొక్కలు నాటి నీరు పోశారు. పట్టణ నర్సరీని పరిశీలించిన నర్సరీలో పెంచుతున్న మొక్కల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ నాగేందర్, తహసీల్దార్ దిలీప్‌నాయక్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
సిద్దిపేటరూరల్: వర్షాల ప్రభావంతో చెరువులు, కెనాల్‌ల వద్ద నీరు ఉప్పొంగి ప్రవహించే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ప్రతీరోజూ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన చోట ఫీవర్ సర్వేలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యశాఖ అధికారులు, డీపీఓ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● ఆరోగ్య కిట్లు పంపిణీ

ప్రజారోగ్యంలో పారిశుద్ధ్య కార్మికులు కీలకం