
మార్గం.. సుగమం
జిల్లాలో పలు రోడ్లకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్) విధానంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో కొత్త రోడ్లను నిర్మించాలని, ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ దిశగా తొలి అడుగు పడింది. జిల్లా వ్యాప్తంగా 166 రోడ్లు.. 721 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించనున్నారు. దీంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
–సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 166 రోడ్లు 721 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో రోడ్డు భవనాల శాఖ (ఆర్ అండ్‌బీ) 16 రోడ్లు 181.6 కిలోమీటర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్(పీఆర్) 150 రోడ్లు 540 కిలో మీటర్లు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న రోడ్ల వెడల్పు, మరమ్మతులు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పలు కన్సల్టెన్సీ సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఈ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.700కోట్లను అంచనా వేసింది. మూడేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తి కానుంది.
ప్రజలపై భారం పడకుండా..
ప్రజలపై భారం పడకుండా, ప్రభుత్వానికి సులభంగా ఉండేలా హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్) విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్, కాంట్రాక్ట్ సంస్థలకు ప్రభుత్వం తొలుత 40శాతం నిధులను అందిస్తుంది. మిగిలిన 60శాతం నిధులను కాంట్రాక్టు సంస్థలే భరించి పనులు పూర్తి చేస్తాయి. ఆ సంస్థలు భరించిన 60శాతం నిధులను ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఏటా కొంత చొప్పున వడ్డీతో సహా చెల్లిస్తుంది. అయితే ఈ రోడ్ల పై టోల్‌గేట్లు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్లను నిర్మించడం, విస్తరించడం ఇదే తొలిసారి. నాణ్యత, నిర్వహణ పర్యవేక్షిస్తూనే చెల్లింపులు ఉంటాయి. జాతీయ రహదారుల్లో ఈ పద్ధతి ప్రవేశపెట్టగా, ప్రస్తుతం గ్రామీణ రోడ్లకు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
పల్లె రోడ్లకు మహర్దశ
హ్యామ్ పద్ధతిలో నిర్మాణం
జిల్లా వ్యాప్తంగా
166 దారులు..721 కిలోమీటర్లు
రూ.700 కోట్ల వ్యయం అంచనా
తీరనున్న ఇబ్బందులు
మండల కేంద్రాల నుంచి గ్రామాలకు, గ్రామాలను కలిపే రోడ్లు చాలా చోట్ల గుంతలుగా, సింగిల్ రోడ్లు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో కల్వర్టులు, వంతెనలు మరమ్మతులకు నోచుకున్నా పూర్తి స్థాయిలో చేయడం లేదు. తాత్కాలిక పనులు చేస్తూ వస్తున్నారు. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టనుండటంతో వాహనదారులు, ప్రజల కష్టాలు తీరనున్నాయి.
వారం రోజుల్లో టెండర్లు
హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కోసం వారం రోజుల్లో టెండర్లను ఈఎన్‌సీ ఆదేశాల మేరకు పిలవడం జరుగుతుంది. స్పాట్ వర్క్‌ల కింద పరిగణలోకి తీసుకుని తక్కువ సమయంలోనే టెండర్లను ఫైనల్ చేయనున్నాం. రోడ్ల వెడల్పు, కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది.
– నరేందర్‌రెడ్డి, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ