ఔటర్‌ రింగ్‌ రైలు కూత | - | Sakshi
Sakshi News home page

ఔటర్‌ రింగ్‌ రైలు కూత

Jul 25 2025 8:11 AM | Updated on Jul 25 2025 8:11 AM

ఔటర్‌

ఔటర్‌ రింగ్‌ రైలు కూత

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 120 కిలోమీటర్లు విస్తరణ
● కీలకంగా మారనున్న గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌ ● హైదరాబాద్‌ స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా విస్తరించే అవకాశం ● ‘మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ హబ్‌’ అభివృద్ధికి మార్గం

లాజిస్టిక్‌ పార్కు అభివృద్ధికి దోహదం

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పరికిబండ శివారులో రూ.996 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు (బహుళవిధ సరుకు రవాణ సేవల సముదాయం) అభివృద్ధికి ఈ రింగు రైలు ప్రాజెక్ట్‌తో బాటల పడనున్నాయి. ఈ లైన్‌తో లాజిస్టిక్‌ అనుసంధానమయ్యే అవకాశాలుండటం వల్ల ఇక్కడి నుంచి సరుకు రవాణా సేవలు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించరించుకునే అవకాశం కలగనుంది. ఇదే కాదు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో రైలు రవాణా ఆధారిత అభివృద్ధి వేగవంతం కానుంది. మహా నగరానికి పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు రవాణా వ్యవస్థ ఏర్పడనుంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకునే అవకాశాలున్నాయి.

గజ్వేల్‌: హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రైలుకు అలైన్‌మెంట్‌ ఖరారు కావడం.. ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్ధికి మరో కీలక అడుగుగా మారింది. ట్రిపుల్‌ఆర్‌ (రీజినల్‌ రింగు రోడ్డు)కు సమాంతరంగా 392కిలోమీటర్ల మేర ఈ అలైన్‌మెంట్‌ ఉండగా.. ఇందులో ఉమ్మడి జిల్లాలోనే 120కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌కు ఈ ప్రాంతం సమీపంలో ఉండటం వల్ల భారీ ప్రయోజనాలు చేకూరి అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా (సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి)తోపాటు వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా రింగు రైలు అలైన్‌మెంట్‌ ఖరారైంది. ట్రిపుల్‌ఆర్‌ (రీజినల్‌ రింగు రోడ్డు)కు సమాంతరంగా 3.5కిలోమీటర్ల దూరంలో, ఒకటి రెండు చోట్ల మాత్రం 11కిలోమీటర్ల దూరంలో అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ వల్ల ఉమ్మడి మెదక్‌ జిల్లాకు జరిగే ప్రయోజనంపై జిల్లావాసుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్టులో భాగంగా ఆరు చోట్ల ఆర్‌ఓఆర్‌(రైల్‌ ఓవర్‌ రైల్‌) వంతెనలు రానున్నాయి. ఈ ఆర్‌ఓఆర్‌ గజ్వేల్‌లో రానుందని ప్రకటనలు వెలువడ్డాయి. జగదేవ్‌పూర్‌, గజ్వేల్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా రింగు రైలు విస్తరించే అవకాశాలున్నాయి.

గజ్వేల్‌ స్టేషన్‌ కీలకం!

రింగు రైలు ప్రాజెక్ట్‌లో మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్‌పై ఉన్న గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌ కీలకంగా మారనుంది. ప్రస్తుతం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్‌ లైనన్‌ నిర్మాణం జరుగుతుండగా.. రూ.1160.47కోట్లు వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్‌ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ లైన్‌ వల్ల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మనోహరాబాద్‌ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్‌ ట్రంక్‌ లైన్‌తో అనుసంధానం కానుంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు ప్రస్తుతం రైలు కూడా నడుస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రింగు రైలు ప్రాజెక్ట్‌ నేపథ్యంలో గజ్వేల్‌ స్టేషన్‌ ఈ లైన్‌తో అనుసంధానం కానుంది. దీని ద్వారా నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్‌ స్టేషన్‌ ప్రత్యామ్నాయంగా మారడానికి అడుగులు పడనున్నాయి. ఈనేపథ్యంలో కొన్ని ప్రధానమైన రైళ్లు ఇక్కడి నుంచే నడిచే అవకాశాలున్నాయి. గజ్వేల్‌ నుంచి వెళ్తున్న ట్రిపుల్‌ఆర్‌ పక్కనే నిర్మించిన ఈ రైల్వేస్టేషన్‌.. యథాతథంగా రింగు రైలుకు కూడా అనుసంధానం కానుంది.

ఔటర్‌ రింగ్‌ రైలు కూత 1
1/1

ఔటర్‌ రింగ్‌ రైలు కూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement