
వైద్యసేవలపై నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హైమావతి ● చేర్యాలలో ఆకస్మిక పర్యటన ● ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
పాఠశాలలో ఉపాధ్యాయుల దావత్
● విద్యార్థులు లేకున్నా.. మధ్యాహ్నంభోజనంలో బగారా రైస్.. చికెన్‌కర్రీ ● కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి.. ● ఉపాధ్యాయుల తీరుపై సీరియస్
చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, సేవల్లో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం కలెక్టర్ చేర్యాల పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. మొదటగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. మందులు స్టాక్ రిజిస్టర్, ఔట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్ పరిశీలించిన ఆమె నిర్వహణ సరిగాలేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. అలాగే రోగులతో మాట్లాడిన ఆమె డాక్టర్, సిబ్బంది సరిగ్గా చూస్తున్నారా? లేదా అని ఆరా తీశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఆస్పత్రి భవనం పూర్తయినందున ఇప్పటివరకు నిర్వహిస్తున్న ఆస్పత్రిలోని పరికరాలను ఇక్కడకు తరలించి వైద్య సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి డాక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోస్తున్న కార్యక్రమానికి కలెక్టర్ హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని సందర్శించిన ఆమె ఎరువుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి గోదాంలో ఉన్న స్టాకును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధిక, ఏఓ భోగేశ్వర్‌ను ఆదేశించారు. వానకాలం పంటకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.
చేర్యాల(సిద్దిపేట): పాఠశాలలో ఉపాధ్యాయులు దావత్ చేసుకున్నారు. బుధవారం విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపు నివ్వడంతో విద్యార్థులంతా ఇంటికెళ్లారు. అయినా ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయడం.. అందులో బగారా రైస్, చికెన్ కర్రీ వండారు. కలెక్టర్ హైమావతి చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వంటగదిని పరిశీలించిన ఆమెకు మెనూలో లేని చికెన్, బగారా అన్నం కనిపించడంతో మండిపడ్డారు. పిల్లలు లేకుండానే వంట ఎందుకు చేశారని ఉపాధ్యాలను వివరణ కోరగా, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు విద్యార్థులను ఇంటికి పంపించామని చెప్పారు. వండిన వంటను వెంటనే హాస్టల్ విద్యార్థులకు పంపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఎంపీడీఓపై చర్యకు ఆదేశాలు..
స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటిని త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ దిలీప్‌నాయక్‌ను ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ మహబూబ్ అలీ విధులకు హాజరు, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించిన ఆమె అతడిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారికి సూచించారు. ఆమె వెంట ఆస్పత్రి వైద్యులు, స్థానిక మున్సిపల్ కమిషనర్ తదితరులున్నారు.

వైద్యసేవలపై నిర్లక్ష్యం తగదు