
వర్షం.. పంటలకు జీవం
● రైతుల్లో హర్షం ● జిల్లా వ్యాప్తంగా 577.2 మి.మీ.వర్షపాతం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాలలో కురిసిన వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నీటి తడులు అవసరం ఉన్న పత్తి, మొక్కజొన్న, కందులు, తదితర ఆరుతడి పంటలు జీవం పోసుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1,20,026 ఎకరాల్లో వరి, 1,04,011 ఎకరాల్లో పత్తి, 25,361 ఎకరాల్లో మొక్కజొన్న, 5,289 ఎకరాల్లో కందులు, 202 ఎకరాల్లో పెసర్లు, ఇతర ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం జిల్లాలో సగటున 22.2మిల్లీమీటర్లు, మొత్తంగా 577.2మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా అక్బర్‌పేట భూంపల్లి మండలంలో 47మి.మీ, నారాయణరావుపేటలో 46మి.మీ, దుబ్బాకలో 45.7మి.మీ, చిన్నకోడూరులో 36.2మి.మీ, బెజ్జంకిలో 35.9మి.మీ, సిద్దిపేట రూరల్‌లో 31.4మి.మీ, హుస్నాబాద్‌లో 30.7మి.మీ, దౌల్తాబాద్‌లో 30.6మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
వానలు ఆదుకున్నాయి
వానాకాలం సాగుకు ముందే వర్షాలు కురవడంతో సంతోషంగా వ్యవసాయ పనులు ప్రారంభించాం. కానీ తీరా విత్తనాలు విత్తాక వర్షాలు వెనకడుగు వేశాయి. దీంతో సాగుపై నీలినీడలు నెలకొన్నాయి. మళ్లీ రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పంటలను ఆదుకుంటున్నాయి. వరుణుడు సరైన సమయంలో అన్నదాతలకు అండగా నిలిచాడు.
– నవీన్, తొగుట

వర్షం.. పంటలకు జీవం