
కాంగ్రెస్ గెలుపే లక్ష్యం కావాలి
● స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దాం ● గత ప్రభుత్వ అవినీతిని ఎండగడదాం ● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్: వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతీకార్యకర్త పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్‌లో మున్సిపాలిటీస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నర్సారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి పేరిట గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం వందల కోట్లు దోచుకున్నదని మండిపడ్డారు. పట్టణంలో యూజీడీ, రింగు రోడ్డు, సీసీ రోడ్లు, బస్టాండ్‌ల నిర్మాణాలు అసంపూర్తిగా నిర్మించారన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వేతనాలు, అలవెన్సులు పొందుతున్నా.. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ నిర్వాకం వల్లే మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. వారి ఇబ్బందులను తీర్చడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా సాహాసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. మరోవైపు గ్రూపు విభేదాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు మొనగారి రాజు, కార్యదర్శి నక్క రాములు తదితరులు పాల్గొన్నారు.