
4 గంటలు.. 22 శాఖలు
అభివృద్ధి పనులపై నిర్విరామంగా మంత్రి వివేక్ సమీక్ష
● సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి ● సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలి ● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ ● సమస్యల వర్షం కురిపించినప్రతిపక్ష ఎమ్మెల్యేలు
నాలుగు గంటలు నిర్విరామంగా.. 22 ప్రభుత్వ శాఖల సమీక్ష సాగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి, కార్మిక శాఖ మంత్రి వివేక్ నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు.
– సాక్షి, సిద్దిపేట
మధ్యాహ్నం 2:50గంటలకు ప్రారంభమైన సమీక్ష సమావేశం సాయంత్రం 6:50గంటల వరకు కొనసాగింది. వ్యవసాయం, హౌసింగ్, వైద్య ఆరోగ్య , రెవెన్యూ, విద్యా, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, జిల్లా సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ, విద్యుత్తు, ఇరిగేషన్, మిషన్ భగీరథ, కార్మిక, ఉపాధి, పరిశ్రమలు, మైనింగ్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలపై సమీక్షను నిర్వహించారు. సమీక్ష సమావేశాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించాలని, 20నెలల్లో ఒక్కసారి మాత్రమే జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమీక్ష నిర్వహించారని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వెంటనే మంత్రి వివేక్ స్పందించి రాత్రి అయినా పర్వాలేదు అన్ని శాఖల పై సమీక్ష చేద్దామన్నారు. ఇప్పటి నుంచి మూడు నెలలకు ఒక సారి నాల్గవ సోమవారం జిల్లా అభివృద్ధిపై సమీక్షను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు జిల్లా అధికారులు సమాధానాలు చెప్పారు. వివిధ శాఖల్లో గత ప్రభుత్వంలో డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయా? ప్రస్తుతం 20 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయా అని మంత్రి వివేక్, ఎమ్మెల్యే హరీశ్‌లు అధికారులను అడుగుతూ నవ్వులు పూయించారు. కార్మిక శాఖకు సంబంధించిన నివేదిక హార్డ్ కాపీని తీసుకురాకుండా ఫోన్‌లో చూసుకుంటూ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రావు చదివారు. ఫోన్‌లు ఎవరు మాట్లాడవద్దని, ఫోన్‌లు హాలులోకి తీసురావద్దని జిల్లా అఽధికారులను మంత్రి ఆదేశించారు.
సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా, రైతు బీమా, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 10 వేల టీచర్ల నియామకం చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, రైతులను ప్రలోభాలకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
యూరియా కోసం బారులు
జిల్లాకు యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉదయం లేసిందంటే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లాలో విద్యుత్ కండక్టర్ల కొరత ఉందని దీంతో నూతన విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పూర్తి స్థాయిలో రుణ మాఫీ కాలేదని, సన్న వడ్ల బోనస్ రైతులకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతూ, ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకపోవడంతో పశువులు, రైతులు మృత్యువాత పడుతున్నారని, ఎన్నో మార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా ఫార్వర్డ్ చేసి టైంపాస్ చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
సిద్దిపేటకు వెయ్యి పడకల ఆస్పత్రి అవసరమా?: మంత్రి వివేక్
ఐదు జిల్లాలకు కేంద్రమైన సిద్దిపేట జిల్లాలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం చివరి దశలో ఉంది. ఆస్పత్రికి కొంత మైనర్ వర్క్‌లకు దాదాపు రూ.25కోట్లు కేటాయిస్తే వినియోగంలోకి వస్తుందని దానికి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని మంత్రి వివేక్‌ను ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. ఈ సందర్బంగా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ మాట్లాడుతూ చిన్న ఊరికి ఇంత పెద్ద ఆస్పత్రి అవసరమా? చెన్నూరులో 100 పడకల ఆస్పత్రి మాత్రమే ఉందని అని అన్నారు. వెంటనే హరీశ్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశ్యంతో రూ.300 కోట్లతో నిర్మాణం చేశామని గుర్తు చేశారు.