ప్రజా సంక్షేమమే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ముఖ్యం

Jul 23 2025 12:33 PM | Updated on Jul 23 2025 12:33 PM

ప్రజా

ప్రజా సంక్షేమమే ముఖ్యం

● ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం ● మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ ● కలెక్టరేట్‌లో రేషన్‌కార్డు ప్రొసీడింగ్‌ల పంపిణీ
ప్రొటోకాల్‌ రగడ

సిద్దిపేటరూరల్‌: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో కొండపాక, సిద్దిపేట అర్బన్‌ మండలాల రేషన్‌కార్డు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంిపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్‌ ముఖ్య అతిథిగా హాజరై రేషన్‌ కార్డు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల కొత్త రేషన్‌కార్డులు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రేషన్‌ కార్డుతో ప్రజలు సన్నబియ్యంతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందేందుకు వీలుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. నేడు ప్రజలు సంతోషంగా తింటున్నారన్నారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం సరాఫరా అయ్యేలా కలెక్టర్‌, యంత్రాంగం పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్‌, ఉచిత బస్సు సౌకర్యం, సబ్సిడీ గ్యాస్‌, సన్నబియ్యం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, సన్నధాన్యానికి బోనస్‌ వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని, ఇక ముందు మరింత ఎక్కువగా ఇళ్లను ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు 400 నుంచి 600 చదరపు అడుగుల్లోనే ఇళ్లు నిర్మించుకుంటేనే డబ్బులు వస్తాయన్నారు.

నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి

అంతకుముందు ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ప్రజల అవసరాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కొత్త రేషన్‌కార్డులు మంజూరైన వారికి కూడా సన్నబియ్యం అందించాలన్నారు. సన్నబియ్యంలో నూకలు ఎక్కువగా ఉండి అన్నం ముద్దగా అవుతుందన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. నాణ్యమైన బియ్యం సరాఫరా చేసేలా ప్రభు త్వం పర్యవేక్షించాలన్నారు. తమతో పాటుగా జిల్లా అభివృద్ధికి ఇన్‌చార్జి మంత్రి సహకరించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హైమావతి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కివెంకటయ్య, అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్‌, అబ్దుల్‌ హమీద్‌, డీసీఎస్‌ఓ తనూజ, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌కార్డుల ప్రొసీడింగ్‌ ప్రక్రియలో ప్రొటోకాల్‌ రగడ ఉద్రిక్తతకు దారితీసింది. పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫొటో ఎందుకు లేదంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు సైతం హరీశ్‌రావు, కొత్తప్రభాకర్‌రెడ్డిలు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం కాస్త ఉద్రిక్తంగా మారింది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇందిరమ్మ ఇళ్లు అందరికీ రావడంలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నించగా.. స్పందించిన మంత్రి వివేక్‌ గత పదేళ్లలో మీరు ఎన్ని ఇళ్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాజకీయం చేయద్దంటూ బీఆర్‌ఎస్‌ నాయకులను హెచ్చరించారు.

బక్కి వెంకటయ్య అసహనం

రేషన్‌కార్డు ప్రొసీడింగ్‌ పత్రాల పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో ఎందుకు వేయలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కివెంకటయ్య కలెక్టర్‌ను అడిగారు. అలాగే తన పేరుతో కుర్చీ కూడా ఏర్పాటు చేయకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి వివేక్‌ తప్పకుండా ప్రొటోకాల్‌ పాటించాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలన్నారు.

ప్రజా సంక్షేమమే ముఖ్యం 1
1/1

ప్రజా సంక్షేమమే ముఖ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement