
దాశరథి జీవితం యువతకు స్ఫూర్తి
ప్రముఖ కవి నందిని సిధారెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కవిత్వం ఉపయోగపడుతుందని ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సాహిత్య సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘దాశరథి జీవితం, సాహిత్యం–ప్రేరణలు’ అనే అంశంపై సిధారెడ్డి మాట్లాడారు. సంస్కత భాషాధిపత్యాన్ని ఎదిరించడంతో ప్రారంభించింది మొదలు.. తన 15 ఏళ్ల వయస్సులో నిజాం పాలనపై సాహిత్యాన్ని ఆయుధంగా మలచి పద్యాలు రాసి ఊరూరా ప్రచారం చేసి నాటి పాలకులకు నిద్రలేకుండా చేశారన్నారు. దాశరథి జీవితం నేటి యువతకు స్పూర్తిదాయకమని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ దాశరథి పద్యాలు తెలంగాణ ప్రజలకు కంచు కాగడాలై కొత్త వెలుగులను అందిస్తాయని చెప్పారు. తెలుగు విభాగాధిపతి డాక్టర్ మట్ట సంపత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దాశరథి కవిత్వపు మానవీయత, సమాజదృక్పఽథం, సాహితీ వైవిధ్యం ఉద్యమాల ప్రేరణ, ధిక్కార స్వరం, సాహసాన్ని పునికిపుచ్చుకుని విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు.
జా.సా.ప ఆధ్వర్యంలో..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలో జాతీయ సాహిత్య పరిషత్(జాసాపా) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కార్యాలయంలో దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కవులు దాశరథి సాహిత్యం, ఆయన తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన తీరును గుర్తు చేసుకున్నారు. నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అని నినదించిన ఆయన సాహిత్యం అజరామరమన్నారు. కార్యక్రమంలో కవులు రాజమౌళి, ఉండ్రాళ్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు.