
నీళ్ల చారు
ఉడకని అన్నం
● పప్పుంతా కారమే ● కానరాని కూరగాయాలు, ఆకు కూరలు ● జనగామ పాఠశాలలో మధ్యాహ్న భోజనం దుస్థితి
అక్కన్నపేట(హుస్నాబాద్): ఉడకని అన్నం.. నీళ్లచారు.. కారం పప్పు.. ఇదీ ప్రభుత్వ పాఠశాలలో నిత్యం కనిపించే మధ్యాహ్న భోజనం దుస్థితి. అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 77మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, మంగళవారం మెనూ ప్రకారం అన్నం, కూరగాయలు, సాంబారుతో భోజనం పెట్టాలి. కానీ నీళ్లచారు, కారం పప్పుతో ఉడకని అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. రోజూ నీళ్లచారు, కారం పప్పుతోనే భోజనం పెడుతున్నారని వాపోయారు. మెనూ ప్రకారం భోజనం అందడంలేదని, పప్పులో కుళ్లిన టమాటా, మిర్చి తదితర వస్తున్నాయని చెబుతున్నారు. పోషకాహారం దేవుడెరుగు, కనీసం చిక్కటి పప్పు అన్నం అందడం లేదని తెలిపారు. ఇదేమిటని ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్మికులను అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని చెప్పినా వినడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

నీళ్ల చారు