
జోరుగా ఫైనాన్స్‌ల దందా?
ప్రైవేటు వడ్డీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. విచ్చలవిడిగా దందాను కొనసాగిస్తూ.. అధిక వడ్డీ వసూలు చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వడ్డీలకు చక్రవడ్డీలు విధిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. దీంతో వారు ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే విలవిల్లాడుతున్నారు. పోలీసులు, రెవెన్యూఅధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఫైనాన్స్‌దందాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
వేధింపులు తట్టుకోలేకపోతున్నాం
నా స్థలాన్ని తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకునేందుకు రెండేళ్ల క్రితం ఫైనాన్స్ సంస్థలో రూ.6లక్షలు అప్పుతీసుకున్నాను. నెలకు రూ.17వేల చొప్పున కిస్తులు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులతో రెండు వాయిదాలు చెల్లించకపోవడంతో ఫోన్‌లు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫ్యామిలీ వారికి, ఫ్రెండ్స్‌కు ఫోన్‌లు చేసి వేధిస్తున్నారు. ఇంటికి వచ్చి బెదిరించడమేకాకుండా దుర్భాషలాడుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
– కొమురవెల్లి యాదగిరి,
తిమ్మాయిపల్లి, నంగనూరు
తీసుకున్న అప్పునకు రెండింతలు
అత్యవసర పరిస్థితుల్లో సిద్దిపేటలోని ఓ ఫైనాన్స్ సంస్థలో తీసుకున్న అప్పుకు రెండింతలు డబ్బు వసూలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట రూ.9లక్షలు అప్పుగా తీసుకున్నాను. నెలకు రూ.22వేల చొప్పున చెల్లిస్తున్నాను. ఒక్కరోజు ఆలస్యం అయినా ఫోన్లు చేస్తున్నారు. ఇంటికి వచ్చి బెదిరింపులకుగురిచేస్తున్నారు.
– బాధితుడు, తిమ్మాయిపల్లి
చర్యలు తీసుకుంటాం
అప్పు తీసుకున్న వారిని ప్రైవేట్ ఫైనా న్స్ సంస్థలు వేధింపులకు గురి చేస్తుంటే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వడ్డీ వసూలు చేయాలి. అధిక వడ్డీ వసూలు చేస్తే చర్యలు తప్పవు. రిజిస్టర్ లేని ఫైనాన్స్ సంస్థలు కొనిసాగిస్తే కేసులు నమోదు చేస్తాం.
– డాక్టర్ అనూరాధ, సీపీ
జిల్లాలో దాదాపుగా 100కి పైగా ఫైనాన్స్ సంస్థలు నిర్వహిస్తున్నారు. ఇందులో సగం వరకు అనధికారికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో బ్రోకర్లను నియమించుకుని అడ్డూఅదుపు లేకుండా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. పలు ఫైనాన్స్ కంపెనీలు నిబంధనలను అతిక్రమించి అధిక వడ్డీలకు అప్పుగా ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని జలగల్లా పట్టి పీడిస్తున్నారు. వీరి బారిన పడిన వారు ఆర్థికంగా కోలుకోనిస్థితికి వెళ్తున్నారు.
అనేక సంతకాలు
జిల్లాలో పలు ఫైనాన్స్ సంస్థలు అధికంగా మార్టిగేజ్ చేసుకుని రుణాలు ఇస్తున్నాయని సమాచారం. రుణాలు తీసుకునే సమయంలో తక్కువ వడ్డీ అని చెప్పి తర్వాత అనేక సాకులు చూపుతూ అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మార్టిగేజ్ చేసుకోవడమేకాకుండా ఆయా సంస్థలు దాదాపు 50కిపైగా సంతకాలు పెట్టించుకుంటున్నారు. నిరక్షరాస్యులు చదవలేరు. అలాగే పలువురికి ఇంగ్లిష్ చదవడం రాదు దీంతో ఏమి చదవకుండానే వేలిముద్రలు వేస్తున్నారు. దీంతో వినియోదారులకు అర్థం కాని రీతిలో గోప్యంగా కూడా అధిక వడ్డీలు, ఇతర చార్జీలు దండుకుంటున్నారు. రుణం తీసుకున్న వారి దగ్గరికి పలు సంస్థలు చెల్లించే చివరి రోజు వచ్చి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా చెల్లిస్తుండటంతో తెలియకుండానే జరిమానాలు సైతం వసూలు చేస్తున్నాయి. వాటికి చక్ర వడ్డీలు విధిస్తున్నారు.
పలువురికి నోటీసులు
ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు చెల్లించలేని వారికి పలు ఫైనాన్స్ సంస్థలు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇంటిని జప్తు చేసుకుంటామని బెదిరింపులకు గురి చేయడంతో రైతులు, సాధారణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంటి వద్దకు ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులు వచ్చిన గోడవలు చేసిన సంఘటనలున్నాయి. అప్పు ఇచ్చే సమయంలో ఒక బ్యాచ్.. వసూలు చేసేందుకు మరో బ్యాచ్‌లను ఫైనాన్స్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో ఏమి చేయలేక పలువురు భూములు అమ్మి ఫైనాన్స్ సంస్థలకు అప్పులు చెల్లిస్తున్నారు. ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి ఆగడాలను ఆరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిరుపేదలే లక్ష్యంగా వ్యాపారం
ఇష్టారాజ్యంగా అధిక వడ్డీ వసూలు
బెదిరింపులు.. దౌర్జన్యాలు
ఆస్తులు స్వాధీనంచేసుకుంటామంటూ నోటీసులు
విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలు

జోరుగా ఫైనాన్స్‌ల దందా?