
నానో ఎరువులపై ఫోకస్
● యూరియా కొరత నేపథ్యంలోవ్యవసాయ శాఖ నిర్ణయం ● జిల్లా అంతటా అవగాహన సదస్సులు ● సాధారణ ఎరువులతో పోలిస్తేమేలంటున్న అధికారులు
గజ్వేల్: జిల్లాలో నానాకాలం సీజన్‌కు సంబంధించి సుమారు 5.50లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. యాసంగిలో 3లక్షల ఎకరాల వరకు సాగవుతాయి. రైతులు రసాయనిక ఎరువులపైనే ఆధారపడటం వల్ల ఏటా జిల్లాలో ఆయా నియోజకవర్గాలకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు యూరియా 35,144 మెట్రిక్ టన్నులు, డీఏపీ 25,524 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 20,419 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 49,474 మెట్రిక్ టన్నులు మొత్తం కలుపుకొని 15,9227 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులు అవసరం ఉంటుందని అంచనా. రబీలో మరో 90వేల మెట్రిక్ టన్నులు అవసరమని తెలుస్తోంది.
యూరియా కొరతతో కష్టాలు
ఇతర ఎరువులతో పోలిస్తే ఏటా యూరియా కొరత రైతులకు కష్టాలను తెచ్చిపెడుతోంది. జిల్లాలో వానాకాలం సీజన్ మొత్తానికి 35,144మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 9,700 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని చోట్ల కొరత తలెత్తింది. పలు మండల కేంద్రాల్లో రైతులు బారులు తీరుతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయశాఖ నానో ఎరువులపై దృష్టి పెట్టింది.
పర్యావరణహితం..
కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇఫ్కో ఉత్పత్తి చేస్తున్న ద్రవ రూప నానో యూరియా, డీఏపీలు సాధారణ ఎరువులతో పోలిస్తే పర్యావరణహితంగా పనిచేస్తాయని వ్యవసాయశాఖ చెబుతోంది. రసాయనిక యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266ఉండగా, నానో యూరియా లిక్విడ్ అర లీటర్ బాటిల్ రూ.225లకే లభిస్తోంది. అర లీటర్ లిక్విడ్ బాటిల్ ఎకరా మొత్తానికి పిచికారీ చేయడానికి సరిపోతుంది. కానీ బస్తాల రూపంలో రైతులు ఎకరాకు 3నుంచి 4బస్తాలను వాడతారు. ఇలా ఒక పంటకు రెండుసార్లు వేస్తారు. అంటే 6నుంచి 8బస్తాలను ఉపయోగిస్తారు. నానో యూరియా మాత్రం రెండుసార్లు పిచికారీ చేయాలనుకుంటే రెండు అర లీటర్ల బాటిళ్లు సరిపోతాయి. అదేవిధంగా డీఏపీ సాధారణ బస్తా ఎమ్మార్పీ రూ.1130ఉండగా నానో డీఏపీ లిక్విడ్ ఎమ్మార్పీ రూ.550మాత్రమే. ఎకరాకు సాధారణంగా బస్తాల్లోని డీఏపీ మూడుసార్లు మూడుకుపైగా బస్తాలు వాడతారు. కానీ నానో లిక్విడ్ డీఏపీ రెండు బాటిళ్లు కొనుగోలు చేస్తే ఎకరాకు సరిపోతుంది. రైతులకు ఖర్చు తగ్గడమేకాకుండా, మంచి ఫలితాలను ఇవ్వనుంది.
రసాయనిక ఎరువులతో అనర్థమే
రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల నేల సారం తగ్గి పంటల సాగులో దిగుబడులు పడిపోతుంటాయిం. పైగా రైతులు నష్టాల బారిన పడటం సహజపరిణామంగా మారుతోంది. పంటల ఉత్పత్తుల్లో పోషకాలు లోపించి, కలుషితమవుతున్నాయి. ఈ పరిణామం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతోంది. నానో ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఉత్పాదకతను పెంచనుంది. అంతేకాకుండా తెగుళ్లను తట్టుకునే శక్తిని పెంపొందిస్తోంది. ఈ అంశాలను రైతులకు వివరించి వారిని చైతన్యపరడానికి వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా ఫర్టిలైజర్స్ డీలర్లు, రైతులతో అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది.
మంచి ఫలితాలు వస్తాయి
నానో ఎరువుల వాడకంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రైతులకు వివరిస్తూ పంటల సాగులో వాడేలా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వీటి వాడకం మేలు అని కూడా చెబుతున్నాం. జిల్లాలో రసాయనిక ఎరువుల కొరత లేదు.
– స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి
నానో ఎరువులపై వ్యవసాయశాఖ ఫోకస్ పెట్టింది. యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఎరువులతో పోలిస్తే.. నానో ఎరువులతో మంచి ఫలితాలుంటాయని రైతులకు వివరిస్తూ చైతన్య పరిచే కార్యాచరణతో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు.