
ఉపకరణాల ఎంపికకు హాజరుకండి
సిద్దిపేటరూరల్: ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఈనెల 22న మధ్యాహ్నం వారి ధ్రువపత్రాల, భౌతిక పరిశీలనకు హాజరు కావాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 18న హాజరుకాని వారు కూడా హాజరు కావాలని సూచించారు.
సంక్షేమ హాస్టళ్ల
దుస్థితి పట్టదా?
హుస్నాబాద్: బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా ఎవరికీ పట్టడంలేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి 24 గంటలు గడిచినా స్థానిక అధికారులు స్పందించలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలని డిమాండ్ చేశాడు. హాస్టళ్లను అధికారులు పర్యవేక్షించకపోడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో అతిథి అధ్యాపకులుగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నిఖత్ అంజుమ్ తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్‌లో 2, మైక్రో బయాలజీ 1, ఇంగ్లిష్ 2, ఫిజిక్స్‌లో 1 చొప్పున సబ్జెక్టులను బోఽధించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 22లో గా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ జీరాక్స్ కాపీలతో దరఖాస్తును కళాశాల లోని కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈనెల 23న ఉదయం 11గంటలకు ఇంటర్వ్యూ, డెమో క్లాసుల ద్వారా ఎంపిక చేస్తారన్నారు.
ఫీల్డు అసిస్టెంట్ల నిరసన
హుస్నాబాద్‌రూరల్: మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం తప్ప వేతనాలు ఇప్పించడంలో పట్టింపు లేదన్నారు. ఉపాధిహామీ పనుల పై వీక్లి సమావేశాలు నిర్వహించి పనులు అప్పగించే అధికారులు వేతనాల విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని అన్నారు. కూలీల చేత పనులు చేయిస్తున్నా మా సమస్యలను ఎందుకు పరిష్కారించడం లేదన్నారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని ఎంపీడీఓకు అందించి వీక్లీ సమావేశాన్ని బహిష్కరించారు.
వైద్య సేవల్లో
ఆదర్శంగా నిలవాలి
సిద్దిపేటకమాన్: వైద్యాధికారులు, సిబ్బంది అందరూ సమష్టిగా కృషి చేసి వైద్య సేవల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని నూతన ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన ధనరాజ్‌ను వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం పలువురు వైద్యులు, సిబ్బంది అతడిని అభినందించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని, సమయ పాలన పాటించాలని సూచించారు.

ఉపకరణాల ఎంపికకు హాజరుకండి