
పచ్చదనం పక్కాగా చేపడదాం
● హుస్నాబాద్ మున్సిపాలిటీ ముందువరుసలో నిలవాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: పచ్చదనం, పరిశుభ్రతలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ మున్సిపాలిటీ నంబర్ వన్‌గా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ఆరపల్లె చౌరస్తాలో త్రిశూలం వాటర్ ఫౌంటేన్‌ను ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్‌లో హుస్నాబాద్ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్, జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించడంపై అధికారులను అభినందించారు. రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, నాలాల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయన్నారు. జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు ఉన్నారు.