
పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం
● నివాసాల మధ్యే మురికి కుంటలు ● వారానికోసారి మాత్రమే చెత్త తొలగింపు ● పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
హుస్నాబాద్ పట్టణంలో జనావాసాల మధ్యే నిలిచిన నీరు
హుస్నాబాద్: మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. మురికి కాలువలు నిండిపోయి దుర్వాసన వస్తోంది. హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులు, 30 వేలకు పైగా జనాభా, 7,533 ఇళ్లు ఉన్నాయి. చెత్తను సేకరించేందుకు మూడు ట్రాక్టర్లు, 10 స్వచ్ఛ ఆటోలు వినియోగిస్తున్నారు. రోజూ ఇళ్ల నుంచి 5.5టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. కానీ మొత్తం 81 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా 45 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారు ఇతర విభాగాల్లో పని చేయడం వల్ల కార్మికుల కొరత ఏర్పడుతోంది. దీంతో వారానికి ఒకసారి మాత్రమే మురికి కాలువలను శుభ్రం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బస్సు డిపో కాలనీ, నేతాజీ కాలనీ, టీచర్స్ కాలనీల్లో చాలా చోట్ల డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురికి నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది.
బైపాస్ రోడ్డుపైనే..
ప్రభుత్వ ఆస్పత్రి బైపాస్ రోడ్డు పనికి రాని వస్తువులకు నిలయంగా మారింది. భవన నిర్మాణ వ్యర్థాలను ప్రధాన రహదారులకు ఇరువైపులా పడేస్తున్నారు. వీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించకపోవడంతో వాహనదారులు, బాటసారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
చెత్తదిబ్బలా పట్టణం
మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయింది. కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన ఏర్పడుతుంది. వర్షాలు కురుస్తుండటంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల డ్రైనేజీ నిర్మించకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.
– రాగుల శ్రీనివాస్, హుస్నాబాద్
నీటిని తొలగించండి
చాలా కాలనీల్లో నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. వర్షాలకు ఖాళీ జాగల్లో నీరు నిలువడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి. లేదంటే దోమలు వ్యాప్తి చెంది రోగాలబారిన పడటం ఖాయం.
– బత్తుల శంకర్ బాబు, హుస్నాబాద్
ఇళ్ల మధ్యే మురుగు
పలు కాలనీల్లో జనావాసాల మధ్య మురుగు నీరు దర్శనమిస్తోంది. దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. వంద రోజుల ప్రణాళికలో భా గంగా ఇళ్ల మధ్య ఉన్న మురికి గుంతల్లో ఆయిల్ బాల్స్, స్ప్రే చేసి మమా అనిపించారు. వర్షాలు కురుస్తుండటంతో అక్కడ వర్షం నీరు చేరి కుంటలుగా మారాయి. మురికి నీటిని బయటకు పంపించకుండా తూతు మంత్రంగా బ్లీచింగ్ పౌడర్ చల్లి అధికారులు చేతులు దులుపుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.

పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం

పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం

పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం