
ఇళ్లు నిర్మించుకోలేం
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల వెనుకడుగు
● 40 నుంచి 60 గజాల నిబంధనే కారణం ● డబ్బులు సరిపోవంటూ మరికొందరు దూరం ● ఇప్పటి వరకు ముగ్గు పోసింది 6,069 మందే ● సాయం పెంచాలని, కొలతల నిబంధన సడలించాలని కోరుతున్న లబ్ధిదారులు
జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్‌లో 131 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. జనవరి 26న పైలెట్ గ్రామంగా తుక్కాపూర్‌ను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 17 మంది ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఇంకా 114 మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకోలేమని 82 మంది ఆ గ్రామ కార్యదర్శికి లేఖ రాసి ఇచ్చారు. దీంతో ఈ నెల 9న గ్రామసభలో తీర్మానం చేసి హౌసింగ్ అధికారులకు పంపించారు. ప్రభుత్వ నిబంధనలతో ఇలా ఒక్క గ్రామమే కాదు చాలా చోట్ల పలువురు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
– సాక్షి, సిద్దిపేట
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు చాలా మంది లబ్ధిదారులు ముందుకు రావడంలేదు. ఓ వైపు నిర్మాణం కొలతల నిబంధనలు.. మరో వైపు ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోవని వెనుకడుగు వేస్తున్నారు. మరి కొందరు పెట్టుబడి లేక నిర్మించుకోవడం లేదు. నిర్మించిన వాటికి సైతం బిల్లుల చెల్లింపు కొంత ఆలస్యం అవుతుండటం మరో కారణం. జిల్లావ్యాప్తంగా 11,605 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 6,069 మందే ముగ్గు పోసి పనులు ప్రారంభించారు.
లబ్ధిదారుల చుట్టూ అధికారులు
జిల్లా వ్యాప్తంగా 5,536 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయలేదు. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో గ్రామ స్థాయి అధికారులు పలుమార్లు లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. నిర్మాణం పనులు ప్రారంభించిన వారికి సైతం బిల్లులు వెంటనే చెల్లించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల పనుల పురోగతి ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నా సకాలంలో అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
నిర్మాణం కొలతల నిబంధనలు
ఇంటి నిర్మాణం అనేది జీవిత కాలం కల. ఇంటి యాజమానికి నచ్చినట్లు నిర్మించుకుంటారు. నిర్మించుకునేది కొంత పెద్దగా నిర్మించుకోవాలని భావిస్తారు. ప్రభుత్వం 40 గజాలకు తగ్గకుండా 60గజాలకు పెరగకుండా నిర్మించాలని నిబంధన పెట్టింది. 60 గజాలకు అంగుళం పెరిగినా సాయం అందించలేమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
తుక్కాపూర్ గ్రామం వ్యూ
పెరిగిన మెటీరియల్ ధరలు
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ. 5లక్షలు సాయం అందిస్తోంది. సిమెంట్, ఐరన్, ఇటుకలు, భవన నిర్మాణ మేసీ్త్రలు, కూలీ డబ్బులు విపరీతంగా పెరగడంతో దాదాపు రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో పేదలు ఇంటి నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఇంటిని తొలగించి అదే స్థానంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ రుణాలు చెల్లించే వెసులుబాటు కల్పించాలని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇళ్లు నిర్మించుకోలేం

ఇళ్లు నిర్మించుకోలేం