
హడలెత్తిస్తున్న కలెక్టర్
విస్తృత పర్యటనలు.. ఆకస్మిక తనిఖీలు
● అ‘టెన్షన్’లో అధికారులు, సిబ్బంది ● జిల్లా పాలనలో తనదైన మార్క్
కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలతో అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు.. గురుకులాలు,
కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ
కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ కార్యాలయానికి వస్తారోనని అధికారులు, సిబ్బంది అ‘టెన్షన్’లో
ఉంటున్నారు. జిల్లా పాలనలో కలెక్టర్ తనదైన మార్క్ చూపిస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా కలెక్టర్‌గా హైమావతి ఈ ఏడాది జూన్ 14న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు, వివిధ శాఖలపై రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, జరుగుతున్న అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో నలుగురు మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల సందర్భంగా కలెక్టర్ మంత్రోచ్ఛరణలు చేశారు. దీంతో మంత్రులందరూ కలెక్టర్‌ను అభినందించారు.
అధికారులకు ఆదేశాలు
జిల్లాలో ఉన్న గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లను ఈ నెల 4 నుంచి కలెక్టర్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వంట గదులు, సరుకులను పరిశీలిస్తున్నారు. వండిన వంటలను రుచి చూస్తున్నారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేస్తున్నారు. విద్యార్థుల మాటమంతీలో సమస్యలు, డైట్ మెనూ వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. అలాగే చదువు, భోజనం ఎలా అందిస్తున్నారని అడుగుతున్నారు. విద్యార్థులు తీసుకవచ్చిన సమస్యలపై వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్టోర్‌ను పరిశీలిస్తూ నాణ్యమైన ఆహారపదర్థాలు మాత్రమే అందించాలని, కాలం చెల్లిన పదార్థాలను వాడకూడదని సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలిస్తున్నారు. తాను ప్రభుత్వ హాస్టళ్లలోనే ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని వివరిస్తున్నారు. మీరు సైతం పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నారు. ‘మొదటి సారి తనిఖీ కనుక.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరో సారి ఇలానే పునరావృతమైతే చర్యలు తప్పవ’ని అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ ఉన్నప్పటికీ అధికారులు ఉదయం ఫింగర్ ప్రింట్ వేసి.. మళ్లీ సాయంత్రం వచ్చి మరో మారు థంబ్ వేసి వెళ్లుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలానే కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, సక్రమంగా విధులు నిర్వర్తిస్తారని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
హుస్నాబాద్: పాఠశాలల్లో, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కలిసి కలెక్టర్ తనిఖీచేశారు. స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డైట్ మెనూ తప్పని సరిగా అమలు చేయాలన్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రతి వంటా రుచికరంగా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల చదువు, భోజనం విషయంలో రాజీ పడవద్దని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు బాగా చదవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇప్పటి నుంచే కష్టపడాలన్నారు. వారి వెంట ఎంఈఓ బండారి మనీల ఉన్నారు.

హడలెత్తిస్తున్న కలెక్టర్