
కూల్చివేతలు ఆపండి
చేర్యాలలో బాధితుల ఆందోళన
చేర్యాల(సిద్దిపేట): జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పట్టణ కేంద్రంలో చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ఆపాలని పలువురు బాధితులు సోమవారం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నవీన్ అక్కడకు వచ్చి ఆందోళన విరమింపజేసిన వారిని స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ గతంలోనే డ్రైనేజీ నిర్మాణం పేరుతో కొంత భాగం కూల్చివేశారని, మళ్లీ ఇప్పుడు రహదారి విస్తరణలో భాగంగా కూల్చి వేయడం సరికాదన్నారు. అనంతరం వారందరూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి టౌన్ ప్లానింగ్ అధికారి కల్యాణ్ చక్రవర్తికి వినతి పత్రం అందించారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే కూల్చివేతలను ఆపాలని విన్నవించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు సంపత్, బాలనారాయణ, కృష్ణమూర్తి, రమేష్, శ్రీనివాస్, చంద్రమౌళి, అంజయ్య, ప్రసాద్, మహేందర్, శంకర్, మురళి పాల్గొన్నారు. వీరికి సీపీఐ నాయకులు అశోక్, భాస్కర్‌రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.