
ఏమయ్యారో?
ఆ ఎనిమిది మంది
● నేటికీ ఆచూకీ లభించని కార్మికుల జాడ
● సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి కుటుంబీకుల్లో ఆందోళన
● రాత్రింబవళ్లు కొనసాగుతున్న తవ్వకాలు
ఒకటి కాదు రెండు కాదు.. ఏడు రోజులు అవుతున్నా వారి ఆప్తుల జాడ లభించడం లేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. తమను ఆదుకోవాల్సిన పెద్ద దిక్కు జాడ తెలియక పోవడంతో మనోవేదనకు లోనవుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆఖరి చూపునకు కూడా నోచుకోకుండా పోతున్నామని కుమిలిపోతున్నారు. వారం రోజులుగా సిగాచీ పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నారు. – పటాన్‌చెరు
పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్పోటనంలో గల్లంతైన కార్మికుల కోసం వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత నెల 30న పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో 143 మంది పనిచేస్తున్నారు. ఆ సమయంలో పనిచేస్తున్న వారిలో గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పారు. ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ మాత్రం నేటికీ దొరకలేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. వారి కుటుంబీకులు మాత్రం పరిశ్రమ వద్ద గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు అధికారులు రాత్రింబవళ్లు సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి భౌతికకాయాల కోసం వెతుకులాట ముమ్మరం చేశారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మట్టి దిబ్బల కింద, బూడిద మట్టిలో అణువణువు వెతుకుతున్నారు. అయితే అక్కడ పని చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు, బాధితుల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది. రెండు రోజుల క్రితం వరకు ఆ శిథిలాల్లో అక్కడక్కడ మాడిపోయిన మాంసం ముద్దలు లభించాయి. కానీ ప్రస్తుతం అలాంటి మానవ అవశేషాలు ఏవీ లభించడం లేదు. వెతుకులాట ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరిందనే చెప్పాలి. పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో దాదాపు 700 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంత వేడికి శరీరాలు పూర్తిగా మాంసం ముద్దలుగా మారి బూడిదలో కానరాకుండా కలిసిపోయి ఉంటాయని భావిస్తున్నారు.
పాలు అమ్ముతానని చెప్పి..
బండ్లగూడలో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన ఆస్టిన్ పాల ప్యాకెట్లు వేసే పని చేస్తానని ఇంట్లో వారికి చెప్పి ఈ పరిశ్రమలో చేరాడట. ఆ పరిశ్రమలో ప్రమాదం జరగిన రోజు కంటే రెండు రోజుల ముందే అక్కడ డ్యూటీలో చేరాడు. మూడో రోజే ప్రమాదం జరిగింది. నేటికీ ఆ యువకుడి ఆచూకీ లభించడం లేదు. ఆస్టిన్ కుటుంబ సభ్యులు కనపడిన ప్రతి అధికారి కాళ్లపై పడుతున్నారు. కనీసం అతడి మృతదేహం అయినా ఇప్పించాలని రోధిస్తున్నారు. ఆస్టిన్ తోడబుట్టిన చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆస్టిన్‌తో పాటు రాహుల్ కుమార్ శర్మ, వెంకటేష్, సిల్వరీ రవి, శివ్‌జీ కుమార్, విజయ్ కుమార్ నిషద్, ఇర్ఫాన్ అన్సారీల ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు.

ఏమయ్యారో?