
అర్జీలను సత్వరం పరిష్కరించండి
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి 152 దరఖాస్తులు
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలను సత్వర పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ లతో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అందిస్తున్న అర్జీలను వెంటనే పరిష్కరించేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయి. అంతకుముందు అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మంగళ, శుక్రవారాల్లో మండల ప్రత్యేక అధికారులు శానిటేషన్, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి, వనమహోత్సవం సహ అన్ని కార్యక్రమాల ప్రగతిని పర్యవేక్షించాలన్నారు. ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డీజిల్‌తో వచ్చిన బాధితుడు..
అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి చెందిన ఎల్లారెడ్డి భూ బాధితుడు తన సమస్య పరిష్కారం కావడం లేదంటూ ప్రజావాణి కార్యక్రమానికి డీజిల్ కవర్‌తో వచ్చారు. పోలీసులు అతడిని తనిఖీ చేయడంతో డీజిల్‌తో ఉన్న కవర్‌ను గమనించారు. దీంతో ఆయనను లోపలికి అనుమతించలేదు. గ్రామంలోని 266, 267 సర్వే నంబర్లలో తన పేరు మీద ఉన్న 23 ఎకరాల భూమిని ఆన్‌లైన్ చేయాలని కోరగా అధికారులు తిప్పించుకుంటున్నారే తప్ప పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదిలేక డీజిల్‌తో కలెక్టరేట్‌కు వచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
ఖాళీ బిందెలతో కలెక్టరేట్‌కు..
చేర్యాల మండల కేంద్రానికి చెందిన మొండి చింత కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బోరు మోటారు పాడై రోజులు గడుస్తున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. దీంతో నీటి ఎద్దడి తీవ్ర మైందన్నారు. తమ కాలనీలోని పాఠశాల విద్యార్థులు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలన్నారు.

అర్జీలను సత్వరం పరిష్కరించండి

అర్జీలను సత్వరం పరిష్కరించండి