
గాలిలో తుంగ.. నిత్యం బెంగ
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
దుబ్బాక అంతటా వ్యాప్తి
● వాహనదారులకూ తప్పనితిప్పలు ● సమస్య తీర్చాలని ప్రజల వేడుకోలు
దుబ్బాకటౌన్: ‘ఇందు గలదు అందులేదని సందేహం వలదు.. ఎందెందువెదికినా అందందే గలదు’.. ఇదేమిటని అనుకుంటున్నారా.. అదే.. తుంగండి. ఇప్పుడు దుబ్బాక అంతటా వ్యాపించింది. ఇళ్లల్లో, హోటళ్లలో, రోడ్లపై, ఎక్కడపడితే అక్కడా గాల్లో తేలియాడుతూ.. ఇటు ప్రజలను అటు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దుబ్బాక పెద్ద చెరువు కట్ట సమీపంలో మురికి నీరు ప్రవహించే ప్రాంతంలో పిచ్చిమొక్కలు (తుంగ) ఏపుగా పెరిగి ఎండాకాలంలో ఎండిపోయాయి. ప్రస్తుతం వీస్తున్న ఉధృతమైన గాలికి తెలుపురంగులో తుంగంతా నలుమూలలా వ్యాపిస్తోంది.
ఆహారపదార్థాలపై..
తుంగ విపరీతంగా గాల్లో తేలియాడటమేకాకుండా తినుబండారాలపై వాలుతోంది. దీంతో హోటళ్లు, మిర్చి పాయింట్, పానీపూరి, మొక్కజొన్న కంకులు, తదితర తినుబండారాలు విక్రయించే వీధి వ్యాపారులు గిరాకీలు కావడం లేదంటూ వాపోతున్నారు. తుంగ ఆహారపదార్థాలపై పేరుకు పోవడంతో ఎవరూ తినడానికి ఇష్టపడటం లేదంటూ వీధి వ్యాపారులు చెబుతున్నారు.
వాహనదారులపై ప్రభావం
ద్విచక్ర వాహనదారుల కళ్లలో, ముక్కులోకి అకస్మాతుగా తుంగ వెళ్లడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ముక్కులోకి వెళ్లడం వల్ల జలుబు, జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతున్నామని వారు వాపోతున్నారు.
న్యూస్‌రీల్
చర్యలు చేపట్టాలి
గాల్లో తుంగతో ఇబ్బందులు అన్నీఇన్నీకావు. దుకాణంలో కూర్చొని పాలు కూడా అమ్మలేక పోతున్నా. తుంగ కళ్లలో, ముక్కులోకి వెళ్లి ఇటీవల అనారోగ్యానికి గురయ్యా. తుంగతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
– నట్‌రాజ్, పాలవ్యాపారి, దుబ్బాక
సమస్య పరిష్కరిస్తాం
తుంగ బహిరంగ ప్రదేశాల్లో పెరిగింది వాస్తవమే. తుంగ పెరిగిన ప్లాటు యజమానులకు నోటీసులు పంపిస్తాం. తుంగ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.
–రమేశ్‌కుమార్,
మున్సిపల్ కమిషనర్, దుబ్బాక

గాలిలో తుంగ.. నిత్యం బెంగ