
ఎన్నాళ్లీ ముప్పు
ముంచెత్తిన ముంపు..
రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు, దుకాణాల్లోకి చేరిన నీరు
● మురికి కాలువల అస్తవ్యస్తమే కారణం ● పూర్తికాని డ్రైనేజీ కనెక్టివిటి పనులు ● కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
హుస్నాబాద్: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన మురికి కాలువల నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. వర్షం వచ్చిందంటే చాలు కాలువలు పొంగిపొర్లి దుకాణాలను ముంచెత్తుతున్నాయి. హుస్నాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరద నీరంతా ఇళ్లు, దుకాణాల్లోకి చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వర్షం ఎప్పుడొచ్చినా ఇళ్లల్లోకి వరద చేరడం పరిపాటిగా మారింది. పట్టణంలోని మెయిన్ రోడ్‌లో మురికి కాలువల నిర్మాణ పనులు దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతునే ఉన్నాయి. పాత డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడం, జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో వరద నీరంతా దుకాణాలు, ఇళ్లల్లోకి చేరాయి. దీంతో రాత్రంతా ప్రజలు జాగారం ఉన్న పరిస్థితి నెలకొంది.
డ్రైనేజీ పనుల్లో జాప్యం
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పోతారం (ఎస్) నుంచి పట్టణ శివారులోని చైతన్య స్కూల్ వరకు డ్రైనేజీ పనులు చేపట్టారు. అనబేరి, మల్లెచెట్టు, అంబేడ్కర్ చౌరస్తాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కనెక్టివిటి పనులు ప్రారంభించలేదు. దీంతో ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోయాయి. అలాగే కాలువల్లో చెత్త చెదారం పేరుకుపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లే దారి లేక రహదారులు, ఇళ్లను ముంచెత్తుతోంది. దీంతో దుర్వాసన వస్తోంది. రహదారి విస్తరణ పనుల్లో కొందరు ఇళ్లకు సెట్‌బ్యాక్ చేయకపోవడంతో మురికి కాలువలు నిర్మించలేకపోతున్నారు. వర్షం వచ్చినప్పుడే మున్సిపల్ సిబ్బంది జేసీబీల సాయంతో చెత్తను తొలగిస్తున్న దుస్థితి నెలకొంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
వర్షాలతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. మురికి కాలువలు, రహదారులు ఎత్తు పెరగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. పైనుంచి వచ్చే వరద నీటిని పట్టణంలోకి రాకుండా మళ్లించాలని స్థానికులు కోరుతున్నా.. అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మునిగినప్పుడే స్థానిక నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు వచ్చి ఓదార్పు యాత్రలు చేపడుతున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్నేళ్లుగా ప్రజలు వరద మంపును ఎదుర్కొంటున్నా పాలకులకు పట్టకపోవడం గమనార్హం.

ఎన్నాళ్లీ ముప్పు

ఎన్నాళ్లీ ముప్పు