
విత్తన కల్తీలకు పాల్పడితే చర్యలు
● జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం హెచ్చరిక ● ములుగు, వర్గల్ మండలాల్లోఆకస్మిక తనిఖీలు
ములుగు(గజ్వేల్)/వర్గల్(గజ్వేల్): కంపెనీలు లాభాపేక్షతో విత్తన కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం ములుగు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని ములుగు, వర్గల్ మండలాల్లో పలు విత్తన ఉత్పత్తి కంపెనీలను జిల్లా వ్యవసాయాధికారి రాధిక, దుబ్బాక ఏడీఏ మల్లయ్య, టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య బృందం ఆకస్మిక తనిఖీ చేశారు. ములుగులోని మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి పూర్ణ అగ్రి సీడ్స్, మణికంఠ ట్రేడర్స్ రిటైల్ అవుట్‌లెట్, వర్గల్ మండలం గౌరారంలోని క్రిస్టల్‌క్రాఫ్ట్ ప్రొటెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను వారు సందర్శించారు. అక్కడ మూల విత్తనం, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి, వాటి శుద్ధీకరణ, నాణ్యత పరీక్షలు, వాటి లాట్ నంబర్లు, నాణ్యత ప్రమాణాలు, ఎక్స్‌పైరీ తేదీలు, పాకెట్ మీద ధృవీకరణ వివరాలు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిందని, దీంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోందన్నారు. కంపెనీలు కల్తీలకు పాల్పడకుండా నాణ్యతాయుత విత్తనాలు అందజేయాలన్నారు. కల్తీలకు పాల్పడితే ఉపేక్షించబోమని వారు స్పష్టం చేశారు. వారి వెంట వర్గల్, మర్కూక్ ఏఓలు శేషశయన, వసంత్‌కుమార్ ఉన్నారు.