
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం సాధించాలి
● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ● ఆయిల్ ఫెడ్, వ్యవసాయ శాఖఅధికారులతో సమీక్ష
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, జిల్లాకు కేటాయించిన 6,500ఎకరాల సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే దిశగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. అలాగే రూ.300 కోట్లతో నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సైతం త్వరలో పూర్తి అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతుల ఇంటికి వెళ్లి ఆయిల్‌పామ్ సాగు వల్ల కలిగే లాభాలు తెలిపి చైతన్యం చేయాలన్నారు. ఇదివరకే సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతులను కలిసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద భూస్వాములనే కాకుండా చిన్న, సన్న కారు రైతులను కూడా ఆయిల్‌పామ్ వైపు మళ్లించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో సాగు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ముందుగా ఉద్యాన శాఖ అధికారి జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన సాగు వివరాలను తెలిపారు. ప్రస్తుతం 12,339 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుందన్నారు. అలాగే 2025–26కు గాను 6,500ఎకరాల లక్ష్యం పెట్టుకొని ఇప్పటివరకు 1,612 ఎకరాలు 456 మంది రైతులను గుర్తించామన్నారు. 209మంది రైతుల నుంచి 661.5 ఎకరాల డిడి కలెక్షన్ చేయించడం జరిగిందన్నారు. సమావేశంలో టీజీ ఆయిల్ ఫెడ్ ఓఎస్‌డీ(ప్లాంటేషన్) కిరణ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాధిక, ఉద్యాన శాఖ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.