
సేవాభావంతో పనిచేయండి
ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: నూతనంగా ఎన్నుకున్న పాలకవర్గ సభ్యులు సేవాభావంతో పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇటీవల ఎన్నికైన శ్రీకృష్ణ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ నూతన పాలకవర్గ సభ్యులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని హరీశ్‌రావు అభినందించి సన్మానించారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్‌ను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా నాయకులు శ్రీహరి యాదవ్, ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలూ.. ఎలా ఉన్నారు?
బాల సదనంలో కమిషన్ సభ్యురాలు
సిద్దిపేటజోన్: ‘పిల్లలు ఎలా ఉన్నారు? ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? ఇబ్బందులు ఉన్నాయా? అంటూ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు వందన ఆరా తీశారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడారు. అందుతున్న సేవలు, సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవుల వేళ ఏమి నేర్చుకున్నారని అడిగారు. సెలవుల్లో ఎదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని సూచించారు. అనంతరం శిశు కేంద్రాన్ని సందర్శించారు. వంటగది, పిల్లల గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం బాల సదనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, షీ టీం, భరోసా, చైల్డ్ లైన్, విభాగాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాధ్యతాయుతంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మీకాంతరెడ్డి, బాలల సంరక్షణ అధికారి రాము, బాల సదనం ఇన్‌చార్జి మమత, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీని కలిసిన ఏసీపీ
సిద్దిపేటకమాన్: నూతన ఏసీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన రవీందర్‌రెడ్డి పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను మర్యాద పూర్వకంగా శుక్రవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా విజబుల్ పోలిసింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు.
ఉచిత వృత్తి శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
చేర్యాల(సిద్దిపేట): ఉచిత వృత్తి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోలోజు నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో 2017 నుంచి చదివిన పూర్వ విద్యార్థుల్లో ఎలాంటి ఉద్యోగం పొందని వారికి ఉన్నతి సంస్థ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వృత్తి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తాటిచెట్ల నరికివేతపై ఫిర్యాదు
మద్దూరు(హుస్నాబాద్): ఎలాంటి అనుమతి లేకుండా తాటిచెట్లను నరికివేసిన రైతుపై గౌడ కులస్తులు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని బైరాన్‌పల్లికి చెందిన భూర భిక్షపతి తన వ్యవసాయ భూమిలో ఉన్న తాటిచెట్లను ఎలాంటి అనుమతి లేకుండా నరికివేశారు. ఫిర్యాదు మేరకు ఎకై ్సజ్ పోలీసులు ఘటనా స్థలాన్ని శుక్రవారం పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.