కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులుండొద్దు
కొండపాక(గజ్వేల్): గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. మండలంలోని జప్తినాచారంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. అలాగే వెలికట్టలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో ముచ్చటించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సదుపాయం లేదని హమాలీలు చెప్పడంతో వెంటనే ఆమె ఐకేపీ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఐకేపీ అధికారుల రిజిస్టర్‌లను పరిశీలించారు. వెలికట్ట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించి అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీఓ, ఏపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎపీఓ మల్లికా ఐకేపీ ఏపీఎం మగ్దుం అలీ, పంచాయతీ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్


