
భూ సమస్యలుంటే దరఖాస్తు చేయండి
అక్కన్నపేట(హుస్నాబాద్): భూ సమస్యలు ఉంటే అర్జీలు పెట్టుకోవాలని కలెక్టర్ మనుచౌదరి రైతులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు చౌటపల్లి, బొడిగెపల్లి గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టంలో సాదాబైనామా, ఆర్‌ఎస్‌ఆర్‌లో విస్తీర్ణం ఎక్కువ తక్కువ, మ్యుటేషన్, సీలింగ్, ఈనామ్, రికార్డు సవరణ, కౌవులుదారుల సమస్యలు ఇతరత్రా వాటికి పరిష్కారం ఈ చట్టంలో ఉందన్నారు. భూ సమస్యలుంటే తప్పకుండా అర్జీలు పెట్టుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో సంజీవ్‌రెడ్డి అనే రైతు మామిడి తోటను పరిశీలించారు.అకాల వర్షానికి నేలపాలైన మామిడి కాయలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను, వాటి నష్టపరిహారం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు
పైలట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తులను స్వీకరించి, రశీదులు అందజేస్తున్నారు. మొదటి రోజు అక్కన్నపేటలో 105, చౌటపల్లిలో 58, బొడిగేపల్లిలో 29 మొత్తం192 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీఓ భానోతు జయరాం, ఆర్‌ఐ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవ్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనుచౌదరి