
భూ భారతిపైనే రైతుల ఆశలు
అక్కన్నపేట(హుస్నాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా ‘అక్కన్నపేట మండలాన్ని’ ఎంపిక చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలంలో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి? ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? వాటి పరిష్కారం ఏ విధంగా సాధ్యమవుతుందని లెక్కలు వేసుకొని చట్టం ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత భూ భారతి పోర్టల్‌లో కూడా వాటికి సంబంధించిన మాడ్యూల్స్‌ను సిద్ధం చేస్తారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోర్టల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తారు. అయితే భూ భారతి పైలట్ ప్రాజెక్టు కింద అక్కన్నపేట మండలాన్ని ఎంపిక చేయడానికి తన వంతు కృషి చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఈ ప్రాంత రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూముల సమస్యలే అధికంగా ఉన్నాయి.
సాదాబైనామాలు,
అసైన్డ్ భూముల కేసులే అధికం
పైలట్ ప్రాజెక్టుగా ‘అక్కన్నపేట’ ఎంపిక
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
షెడ్యూల్ వివరాలు
భూ భారతి చట్టం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో తహసీల్దార్ అనంతరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాల తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడినట్లు తెలిపారు. ఈ బృందాల్లో మొదటి టీంలో అక్కన్నపేట తహసీల్దార్ అనంతరెడ్డి, రెండో టీంలో హుస్నాబాద్ తహసీల్దార్ జీ.రవీందర్‌రెడ్డి, మూడో టీంలో కోహెడ తహసీల్దార్ కె.సురేఖ ఉన్నారు.

భూ భారతిపైనే రైతుల ఆశలు