
దైవ సన్నిధిలో అందరం సమానమే
● చిన్ననాటి నుంచే పిల్లల్లో సంస్కృతి నేర్పించాలి ● తీర్థ గోష్టిలో త్రిదండి చినజీయర్ స్వామి ● ఘనంగా కొనసాగుతున్న ఆలయ స్వర్ణోత్సవాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దైవ సన్నిధిలో ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థగోష్టి, రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ చిన్నపిల్లలను క్రమశిక్షణతో పాటు, మన సంస్కృతి అలవడే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. చిన్నారులను ఆలయాలకు తీసుకురావడం, దైవిక కార్యక్రమాలలో పాల్గొనేలా చేయాలన్నారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో సిద్దిపేట మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దామన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ జీవితంలో ఎన్ని పదవులు వరించినా, డబ్బులు సంపాదించిన దొరకని మానసిక ప్రశాంతత దైవ సన్నిధిలో దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం దైవ చింతనకు కేటాయించాలన్నారు. దానాలకు, ధార్మిక కార్యక్రమాలకు సిద్దిపేట వాసులే ముందు వరుసలో ఉంటారన్నారు. ఆలయ స్వర్ణోత్సవాల వేళ సిద్దిపేట పట్టణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణతో జిల్లా కేంద్రం మార్మోగింది.

దైవ సన్నిధిలో అందరం సమానమే