
ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయండి
నెలాఖరులోగా పెండింగ్ సీఎంఆర్ అందించండి
రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్
అబ్దుల్ హమీద్
సిద్దిపేటరూరల్: మిల్లర్లు ఈ నెలాఖరులోగా పెండింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అందించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2024–25కు సంబంధించి సీఎంఆర్ బాకీ ఉన్న మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు 1,91,769 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డెలివరీ ఇవ్వాల్సి ఉండగా.. 1,17,549 మెట్రిక్ టన్నులే డెలివరీ చేశారన్నారు. ఇంకా 74,221 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉందన్నారు. గడువులోపు సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ప్రవీణ్, డీసీఎస్‌ఓ ఇన్‌చార్జి సాయి, రవి, ఇతర సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
గజ్వేల్: ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం గజ్వేల్ మండలం జాలిగామలో వడ్ల కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. ఈ సందర్భంగా జాలిగామ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోగా, లారీలు తెప్పించి లోడ్ చేయించి పంపించారు. తడిసిన ధాన్యాన్ని సైతం మిల్లులకు రవాణా చేయాలన్నారు. ఆ తర్వాత గజ్వేల్ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ డీఏం ప్రవీణ్, గజ్వేల్ తహసీల్దార్ శ్రావన్‌కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్