
ధాన్యం తరలింపులో ఇబ్బందులుండొద్దు
కోహెడరూరల్(హుస్నాబాద్)/హుస్నాబాద్: ధాన్యం తరలింపులో వాహనాల ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో అధునాతన పాడి క్లీనర్ అండ్ డ్రయ్యర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయాల జాతర ఉత్సవాలపై అధికారుల సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.180కోట్లతో మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. శనిగరం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని అడిగారని, త్వరలో కల్పిస్తామన్నారు. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలను స్థపతి ప్రకారమే అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు జరిగే జాతరకు ఏర్పా ట్లు చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు మత్తడి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి ఉన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
రూ.9 కోట్లతో ఎల్లమ్మ ఆలయం
అభివృద్ధికి ప్రతిపాదనలు