
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందే
సిద్దిపేటజోన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందేనని సిద్దిపేట ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రద్దు చేసేవరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నమాజ్ అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు అబ్దుల్ సమి, ఉబెదుర్ రహమాన్ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం తగదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కొత్త చట్టం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
కఠినంగా శిక్షించాలి..
కశ్మీర్ లోయల్లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడిని జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ నిరసన