క్రషింగ్‌ అనుమానమే! | - | Sakshi
Sakshi News home page

క్రషింగ్‌ అనుమానమే!

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

జహీరాబాద్‌లోని ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారంలో 2026–27 సీజన్‌కు సంబంధించి చెరకు క్రషింగ్‌ అనుమానంగానే ఉంది. అధికార యంత్రాంగం నోట సైతం ఇదే మాటవినిపిస్తోంది. గత యాజమాన్యం బదిలీ అయిందని, క్రషింగ్‌కు కర్మాగారాన్ని సిద్ధం చేస్తోందని రైతులు ఆశిస్తూ వచ్చారు. తీరా యాజమాన్యం క్రషింగ్‌ను నిర్వహించే దిశలో ప్రయత్నాలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– జహీరాబాద్‌

రో నాలుగు నెలల్లో క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభం కాబోతున్నా.. ఇప్పటివరకు ట్రైడెంట్‌ యాజమాన్యం లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయలేదని కేన్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. లైసెన్స్‌ కోసం యాజమాన్యం ప్రభుత్వాన్ని సంపద్రించాల్సి ఉంది. ప్రస్తుతం కర్మాగారానికి జోన్‌ పరిధి లేదు. ట్రయల్‌రన్‌కు సంబంధించి ప్రభుత్వానికి రిపోర్టు కూడా సమర్పించలేదని సమాచారం. చెరకు పరిధిని కేటాయించాలని కోరుతూ ముందుకు సైతం రాలేదు. రైతులకు సంబంధించిన సమాచారం సైతం యాజమాన్యం వద్ద లేక పోగా, అగ్రిమెంట్‌ కోసం రైతులను ఆహ్వానించిన సందర్భాలు సైతం లేవు. దీంతో క్రషింగ్‌ విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం జహీరాబాద్‌, మొగుడంపల్లి మండలాలు ఫ్రీ జోన్‌ కింద ఉన్నాయి. కర్మాగారంలో క్రషింగ్‌ చేపడితే రెండు మండలాలను కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మండలాల్లో సుమారు 6 లక్షల టన్నుల మేర చెరకు ఉత్పత్తి కానుందని అంచనా. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో ఇతర కర్మాగారాల కిందకు చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

చెల్లించని సీడీసీ బకాయిలు

కర్మాగారం కేన్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీడీసీ)కి చెల్లించాల్సిన బకాయిలను సైతం చెల్లించలేదు. రూ.31.05 లక్షల మేర సీడీసీకి బకాయి పడింది. వీటిపై రూ.2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా కార్మికులకు సైతం వేతన బకాయి పడినట్లు కార్మికులు చెబుతున్నారు.

మూడు సీజన్ల పాటు మూత

రైతులకు చెరకు బిల్లులు, కార్మికులకు వేతనాల చెల్లింపుల విషయంలో గత యాజమాన్యం జాప్యం చేసింది. కర్మాగారాన్ని నడిపించే విషయంలో యాజమాన్యం వైఫల్యం కావడంతో విధిలేని పరిస్థితుల్లో కర్మాగారం మూత పడింది. దీంతో వరుసగా 2023–24, 2024–25, 2025–26 సీజన్‌కు గాను క్రషింగ్‌ కొనసాగలేదు. ఫలితంగా చెరకు రైతులకు సమస్యలు తలెత్తాయి. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం జహీరాబాద్‌ జోన్‌ పరిధిలో ఉన్న చెరకును పలు కర్మాగారాలకు తరలించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు చక్కెర కర్మాగారాలను తరలించేలా చర్యలు చేపట్టింది. కొందరు రైతులు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలను ఆశ్రయించారు.

సమాచారం లేదు

క్రషింగ్‌ చేపడతామని యాజమాన్యం ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. లైసెన్సు కోసం దరఖాస్తు సైతం చేసుకోలేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను మొత్తం చెల్లిస్తే లైసెన్స్‌ జారీ చేసే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వారం పాటు యాజమాన్యం తీరును పరిశీలిస్తాం. అనంతరం ఆయా కర్మాగారాలకు చెరకును తరలించుకునేందుకు ప్రత్యామ్నాయంగా మండలాలను అలాట్‌ చేస్తాం.

– రాజశేఖర్‌,

కేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, సంగారెడ్డి

లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయని ‘ట్రైడెంట్‌’

చెరకు అగ్రిమెంట్‌ కోసం

ప్రయత్నం శూన్యం

యాజమాన్యం తీరుతో రైతుల్లో నైరాశ్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement