జహీరాబాద్‌ మీదుగానే బుల్లెట్‌ రైలు నడపాలి | - | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌ మీదుగానే బుల్లెట్‌ రైలు నడపాలి

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

ప్రధాని నరేంద్ర మోదీకి

లింగాయత్‌ సమాజ్‌ వినతి

జహీరాబాద్‌ టౌన్‌: ముంబై–హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలును జహీరాబాద్‌ మీదుగానే నడపాలని లింగాయత్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం పంపారు. ఈ విషయాన్ని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సుభాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్‌ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఇక్కడ 12 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక నిమ్జ్‌ ప్రాజెక్టులుస్తున్నాయని, ఈ ప్రాజెక్టుల కోసం ఇక్కడి రైతులు తమ విలువైన భూములను ఇచ్చారు. పుణె నుంచి హైదరాబాద్‌కు వచ్చే బుల్లెట్‌ రైలును మొదట జహీరాబాద్‌ మీదుగానే ప్రతిపాదించారన్నారు. కానీ, ఆ తర్వాత డీపీఆర్‌ మార్చారన్నారు. ఈ రూట్‌ను వికారాబాద్‌కు మళ్లించడంపై లింగాయత్‌ సమాజ్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ ప్రాంత పారిశ్రామిక ప్రగతిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైలును నడపాలని ప్రధాని మోదీని కోరామని చెప్పారు.

ఓటరు భాగస్వాములు

కావాలి: ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌: కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్‌ కార్యక్రమంలో అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు కోరారు. సోమవారం మండలంలోని అల్గోల్‌ గ్రామంలో సర్‌ కార్యక్రమ ఓట్‌ మ్యాపింగ్‌ను పరిశీలించారు. ఈ మేరకు సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. బీఎల్‌ఓలు అందజేసే ఎన్యూమరేషన్‌ ఫారంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. బూత్‌ లెవెల్‌ అధికారులు సర్‌ను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించేందుకు బీఎల్‌ఓలు కృషి చేయాలని, నకిలీ ఓట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తట్టు నారాయణ పాల్గొన్నారు.

చేతులెత్తేస్తున్న బీఎల్‌ఓలు!

జోగిపేట(అందోల్‌): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా బీఎల్‌ఓలు తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌లో ఇంటింటికీ ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గురువారం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. అయితే అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 208వ బూత్‌లో బీఎల్‌ఓ తాను స్వయంగా ఫారాలు అందజేయాల్సి ఉండగా, రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టేశారు. నాయకులే ఇంటింటికీ ఫారాలు ఇస్తూ వారే భర్తీ చేసేందుకు చొరవ చూపడం విశేషం. ఇటీవల బీఎల్‌ఓల పాత్రపై ప్రజాప్రతినిధులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని తహసీల్దార్‌ మధుకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

ఉద్యాన పంటల

సాగుకు ప్రోత్సాహం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సోమేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని హద్నూర్‌ గ్రామంలో ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన పరికరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగును పెంచేందుకు రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లతో పాటు విత్తనాలను కూడా సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement