మోగిన ఎన్నికల నగారా
జోగిపేట(అందోల్): చేనేత సహకార సంఘాల ఎన్నికల పోరు మొదలైంది. ఇందుకు ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, హన్మంతరావుపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, భవానీ పీఎల్ సంఘం సదాశివపేటకు జూలైలో ఎన్నికలు జరగనున్నాయి. సహకార సంఘాల ఎన్నికలు 2013 ఫిబ్రవరిలో నిర్వహించగా, 2018లో కాలపరిమితి ముగిసింది. ఆ తర్వాత ఎన్నికలు జరగలేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు పాత పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో మొత్తం 17 సార్లు గడువు పొడిగించగా, చివరిగా పదవీకాలాన్ని మరో మూడు నెలలు పెంచారు. రాష్ట్ర చేనేత వస్త్ర పరిశ్రమల కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్ 32(7)(ఏ)(1) ప్రకారం పొడిగించారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 9 వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
జాబితా సిద్ధం..
ఇటీవల చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కార్మికుల నుంచి డిమాండ్ రావడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి ఓటరు జాబితాను సిద్ధం చేసింది. చేనేత జౌళీశాఖ కమిషనర్ ఓటరు జాబితా తయారీకి మార్చి 24న ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు జాబితా తయారీ గడువు విధించగా, ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి చేశారు. చనిపోయిన వారు, డిఫాల్టర్లు, (సొసైటీకి నగదు, లేదా వస్తురూపంలో బకాయి ఉంటే) 90 రోజుల కంటే ఎక్కువ బకాయి ఉంటే వారిని డిఫాల్టర్‌గా పరిగణించి ఓటును తొలగించారు. అలాగే చనిపోయిన వారి పేర్లను కూడా తీసివేశారు. కాగా అర్హులైన వారి ఓటర్లను గుర్తించి జాబితా సిద్ధం చేశారు.
జిల్లాలో ఎన్నికలు ఇలా..
జిల్లాలో ఆరు చేనేత సొసైటీలకు జూలైలో ఎన్నికలు జరగనున్నాయి. జూలై 3న భవానీ పీఎల్ సదాశివపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, హన్మంతరావుపేట సొసైటీలకు, 10న జోగిపేట, సదాశివపేట సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జోగిపేట చేనేత సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. 2,3,4 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 5న పరిశీలన, 6న విత్‌డ్రా అనంతరం ఈనెల 10న పోలింగ్ నిర్వహిస్తారు. సంఘాల్లో అప్పులు లేకుండా ఉన్న సభ్యులకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 13 ఏళ్ల తర్వాత చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుండటంతో నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఆరు సంఘాలకు
షెడ్యూల్ విడుదల
3న సదాశివపేట, నారాయణఖేడ్,
హన్మంతరావుపేటకు..
10న జోగిపేట సొసైటీకి ఎన్నికలు


