గైర్హాజరైతే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

గైర్హాజరైతే చర్యలు తప్పవు

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

సంగారెడ్డి జోన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. కలెక్టర్‌, అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్‌, డివిజన్‌ కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలో 75 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గైర్హాజరయిన అధికారులకు షోకాజ్‌ నోటీసులు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

55 శాతం ఫారాలు పంపిణీ

సంగారెడ్డి జోన్‌: ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 55 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశామని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. జిల్లాలో 100 శాతం ఫారాలు పంపిణీ చేసి, పూర్తిగా నింపిన ఫారాలను సేకరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఓటరు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతో పాటు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపడంలో ప్రజలకు అవసరమైన సహాయం అందించేలా బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాండు, ఆర్డీఓలు రాజేందర్‌, రమేశ్‌, వెంకటేశం, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement