వ్యాపార, నివాసాల యజమానులు
నారాయణఖేడ్: పట్టణంలో రోడ్డు విస్తరణను 35 అడుగులకు మించి చేయొద్దని, ఆస్తులు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని రహదారికి రెండువైపులా ఉన్న వ్యాపార, నివాసాల యజమానులు తీర్మానించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం వారు సమావేశమయ్యారు. జాతీయ రహదారులశాఖ 100 అడుగులకు మార్కింగ్ వేయగా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌ను కలిసి తమ గోడు వివరించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార సముదాయాలు, నివాసాలు కూల్చడం వల్ల 70 భవనాలు, వెయ్యి మంది భారీగా నష్టపోతారన్నారు. రోడ్డుపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, తమ జీవిత కాలం కష్టపడి సంపాదించిన ఇళ్లు, దుకాణాలు కొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని గుర్తించి నష్టం వాటిల్లకుండా చూడాలని, ఆర్థికంగా ఆదుకోలని కోరారు.


