సింగూరు భూ అక్రమణలపై అధికారుల సర్వే | - | Sakshi
Sakshi News home page

సింగూరు భూ అక్రమణలపై అధికారుల సర్వే

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

వట్‌పల్లి(అందోల్‌): సింగూరు ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతంలో వందల ఎకరాలను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. బుధవారం మండల పరిధిలోని ఖాదిరాబాద్‌ గ్రామ శివారులో సింగూరు భూముల్లో జరుగుతున్న పనులను రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించారు. సర్వే నంబర్‌. 424 పెద్దచెరువులో గల 14 ఎకరాల పట్టా భూములు, సర్వే నెంబర్‌ 425లో గల శిఖం భూముల ఆక్రమణలపై సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌కు సంబంధించిన భూములు, రెవెన్యూ భూముల హద్దులను గుర్తించడంలో సర్వేను చేశారు. అదే విధంగా గడి నిర్మాణం చేపట్టేందుకు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ జంగేశ్వర్‌ మాట్లాడుతూ 424, 425 సర్వే నంబర్లలో సర్వే పట్టా భూములు, శిఖం భూములను గుర్తించడంలో సర్వే చేపట్టామన్నారు. ఇంకా సర్వే పూర్తికాలేదని గురువారం నాటికి సర్వే పూర్తి చేసి గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహసీల్దార్‌ తెలిపారు. సర్వేయర్‌ మురళీధర్‌, జీపీఓ యోహన్‌, ఇరిగేషన్‌ ఏఈఈలు యాదయ్య, నవీన్‌, నాగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement