తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేలా ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌కు రూపకల్పన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ డాక్యుమెంట్ తెలంగాణకు ఒక భగవద్గీతలాంటిదని, ఇది రాష్ట్రం రూపురేఖలు మార్చే అభివృద్ధి, బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. నిరుపేదల సంక్షేమం, సమగ్ర విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక, జవాబుదారితనంతో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఇప్పటికే వెల్ఫేర్, సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, టూరిజం పాలసీలను సిద్ధం చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘మహలక్ష్మి పథకం కింద మహిళలు 5.32 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. రూ.239 కోట్ల మేరకు లబ్ధి జరిగింది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ద్వారా 1.76లక్షల మంది వినియోగదారులకు రూ.21 కోట్ల సబ్సిడీని అందించాం. గృహజ్యోతి పథకం ద్వారా రెండు లక్షల గృహ వినియోగదారులకు రూ.180 కోట్లు కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. రైతు భరోసా పథ కం కింద 2025 వానాకాలం సీజన్లో 3.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.422 కోట్లు జమ చేశాం. జిల్లాలో ఇప్పటి వరకు 1,794 ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారులకు రూ.203 కోట్ల మేరకు లఇ్ధ చేకూరింది. 2.24 లక్షల ఎస్‌హెచ్‌జీ మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.79.60 కోట్లు రుణాలు ఇచ్చాం. 3.33 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేశాం. రైతుబీమా పథకం కింద 2.48 లక్షల మంది రైతుల పేర్లను నమోదు చేశాం. 2025–26 సంవత్సరంలో మరణించిన 698 మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ.34.90 కోట్ల పరిహారం అందించాం..’అని మంత్రి వివరించారు.
వ్యవసాయ యాంత్రీకరణ.
‘‘వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 7,800 మంది రైతులకు రూ.6 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయనున్నాం. సంగారెడ్డి, అందోల్‌లలో నర్సింగ్ కాలేజీ భవనాలు, కొత్త పీహెచ్‌సీలను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలు 27 అందుబాటులోకి వచ్చాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఫార్మాసుటికల్ సైన్సెస్ అభివృద్ధికి రూ.57 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతి మంజూరైంది. రాజీవ్ ఆరోగ్య పథకం కింద జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఈరోజు వరకు 47,833 మందికి శస్త్ర చికిత్సలు చేయగా రూ.134 కోట్ల బిల్లులు చెల్లించాం ’అని దామోదర తెలిపారు.
132 ప్రీప్రైమరీ పాఠశాలలు
‘‘ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా 132 ప్రీప్రైమరీ పాఠశాలలు మంజూరు చేశాం. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4.43 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతినెల ఉచితంగా 9,485 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇస్తున్నాం. 74 మంది దివ్యాంగులకు రిట్రో పిట్టేడ్ స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్స్ ఉచితంగా పంపిణి చేశాం. 16 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి రూ. 3.90 కోట్లు రైతులకు చెల్లించాం. సేకరించిన ధాన్యానికి సంబంధించి రూ.159కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు,, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆరైవ్ అలైవ్, కమ్యూనిటీ పోలిసింగ్, సోషల్ మీడియా ద్వారా పోలీసుశాఖ ప్రజలను చైతన్య పరుస్తోంది. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 57 మంది బాల కార్మికులను పని నుంచి విముక్తి లభించింది..’’అని రాజనర్సింహ చెప్పారు.
ఇది తెలంగాణ భవిష్యత్‌కు భగవద్గీత లాంటిది
సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాలసీలతో సర్వతోముఖాభివృద్ధి
నర్సరీ నుంచి ఇంటర్ వరకు సమగ్ర విద్యావిధానం
మంత్రి దామోదర రాజనర్సింహ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు


