కలెక్టర్ ప్రతీక్‌జైన్
సంగారెడ్డిజోన్: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో మంగళవారం ఆయన వీడియో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీవర్షాల సమయంలో ప్రమాదాలు తలెత్తే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. నిరు అధికంగా నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించి సర్ ఓటరు జాబితా, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఏ పంటలు సాగుచేయాలో ముందుగానే సూచించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిన్నారం (పటాన్‌చెరు): స్థానిక పట్టణ కేంద్ర సమీపంలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపీసీ, ఎంపీసీ మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో సంప్రదించాలన్నారు.


