బస్సులెరుగని పల్లెలు | - | Sakshi
Sakshi News home page

బస్సులెరుగని పల్లెలు

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

రవాణా లేని ఏడు గ్రామాలు

హుస్నాబాద్‌రూరల్‌: ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తుంది. కాగా గిరిజన తండాలకు, చిన్న గ్రామాలకు బస్సులు రాకపోవడంతో మహిళలు, విద్యార్థులు నిరుత్సాహపడుతున్నారు. సర్కారు మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినా అవి అందని ద్రాక్షగానే మిగిలిపోయాయని వాపోతున్నారు. ఇప్పటికి బస్సు ఎరుగని పల్లెలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో పల్లెలకు బస్సులు రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్యా.. మా మొర ఆలకించి, గ్రామాలకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

బస్సులు లేక.. కాలినడకన

హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపోలో 62 బస్సులు ఉండగా 22 రూట్లలో అధికారులు నడిపిస్తున్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మీర్జాపూర్‌లో నిర్మించారు. కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం మరిచారు. ఆస్పత్రికి వెళ్లాలంటే గుంతల రోడ్డుపై ప్రయాణం చేయాల్సి రావడంతో వెనుకడుగు వేస్తున్నారు. వంగరామయ్యపల్లె వచ్చిన బస్సు దిగిన తరువాత.. భల్లునాయక్‌తండా, మీర్జాపూర్‌ గ్రామాల ప్రజలు కాలినడకన పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్‌, హన్మకొండ, కరీంనగర్‌ పట్టణాలకు వెళ్లాలంటే రూ. 30 చార్జి చెల్లించి ఆటో ఎక్కితే తప్ప ప్రజలకు ఆర్టీసీ బస్సు దొరకదు. హుస్నాబాద్‌ ఉమ్మడి మండలంలో భల్లునాయక్‌తండా, మీర్జాపూర్‌, మడద, దేవేంద్రనగర్‌, మంచీళ్లబండ, చౌటపల్లి, ఉమ్మాపూర్‌ గ్రామాలకు ఇప్పటి వరకు బస్సులు రావడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రైవేట్‌ వాహనాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామాల మీదుగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఉచిత బస్సుకు గిరిజనులు దూరం

ఆస్పత్రికి వెళ్లాలంటే

కాలినడకే దిక్కు..

గుంతల రోడ్డుతో

తండావాసుల అవస్థలు

మంత్రివర్యా..మొర ఆలకించరూ!

Advertisement
 
Advertisement
Advertisement