● ములుగు సీఈఓలో మామిడి తోటల పరిశీలన
● ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ యాస్మిన్ బాష
ములుగు(గజ్వేల్): అధిక సాంద్రత మామిడి సాగు పద్ధతిలో సంప్రదాయ విధానం కంటే ఎక్కువ దిగుబడి, లాభాలు పొందవచ్చని ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ యాస్మిన్ బాష అన్నారు. ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ప్రూట్స్(సీఈఓ) కేంద్రాన్ని బుధవారం సందర్శించి అత్యధిక సాంద్రత పద్ధతిలో నాటిన మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసర్, దసేరి, ఇమామ్ పసంద్, సువర్ణరేఖ, చెరుకు రసం, రత్న, అమర్‌పాలీ, మహమూడ వికారాబాద్, అమిని, జలాల్ మామిడి రకాలు అధిక లాభాలను అందిస్తున్నాయని చెప్పారు. ఈ పద్ధతిని ప్రోత్సహించేందుకు హార్టికల్చర్ శాఖ తరపున ఎంఐడీహెచ్ పథకం ద్వారా హెక్టారుకు రూ.80 వేలు సబ్సిడీ అందజేస్తారన్నారు. దీనికి అదనంగా డ్రిప్ రాయితీ కూడా ఇస్తారని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రూ.50కి ఒక మామిడి మొక్క చొప్పున విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తన మరియు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కిరణ్, హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె.రామలక్ష్మి, అధికారులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


