అవగాహనే ధ్యేయం.. ఆదాయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అవగాహనే ధ్యేయం.. ఆదాయమే లక్ష్యం

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

సంగారెడ్డి జోన్‌: వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగించి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు వ్యవసాయ అంశాలపై సూచనలు సలహాలిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రసాయన ఎరువుల వినియోగం, సేంద్రియసాగు, పంటమార్పిడి విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయంలో ఆదాయం పెంచటమే లక్ష్యంగా ఈ సదస్సులను నిర్వహిస్తున్నారు. యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌, సాగునీటి ఆదా, పెట్టుబడి ఖర్చులు తగ్గింపు తదితర అంశాలను కూడా రైతులకు వివరిస్తున్నారు.

ఇద్దరు శాస్త్రవేత్తలు, ఒక వ్యవసాయాధికారి

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారి ఉంటారు. జిల్లావ్యాప్తంగా 18 బృందాలుగా ఏర్పడి 144 గ్రామాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన ఈ సదస్సులు మే 23 వరకు కొనసాగుతాయి. ఏ గ్రామాల్లో ఎప్పుడు నిర్వహించాలి? ఎవరెవరు పాల్గొంటారు? అనే అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించారు. జిల్లాను రెండు క్లస్టర్లుగా విభజించి డా.విజయ్‌ కుమార్‌, డా.అరుణలను ఇన్‌చార్జిలుగా నియమించారు.

రైతుల సమస్యలు శాస్త్రవేత్తకు ముందుకు

దస్సులు నిర్వహించిన సమయంలో రైతులు తమ సమస్యలను అధికారుల, వ్యవసాయ శాస్త్రవేత్తల ముందు ఉంచుతున్నారు. కల్తీ విత్తనాల నివారించి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అధిక దిగుబడులు పొందేందుకు కొత్త వంగడాలను సరఫరా చేయాలని, పంట సాగుకు సరిపడా యూరియా, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెబుతున్నారు.

ఆధునిక సాగు విధానాలు, ఎరువుల వినియోగంపై రైతులకు సలహాలు

ఏప్రిల్‌ 27 నుంచి రైతు ముంగిట్లోశాస్త్రవేత్తల కార్యక్రమం

మే 23 వరకు 18 బృందాలతో144 గ్రామాల్లో పర్యటన

Advertisement
 
Advertisement
Advertisement