డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి | - | Sakshi
Sakshi News home page

డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

సంగారెడ్డి జోన్‌: జిల్లా పంచాయతీ అధికారిగా ఏ.మల్లారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డీఎల్‌పీఓగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతి పొంది బదిలీపై జిల్లాకు వచ్చారు. కొన్ని నెలలుగా జిల్లా పరిషత్తు సీఈఓ జానకిరెడ్డి ఇన్‌చార్జి డీపీఓగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డిని కలెక్టరేట్‌లోని డీపీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.

ముగిసిన శిక్షణ తరగతులు

జహీరాబాద్‌ టౌన్‌: మొగుడంపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జనగణన శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. మే 11 నుంచి నిర్వహించనున్న జనగణనకు సంబంధించి టీచర్లకు శిక్షణనిచ్చారు. రెండవ విడతలో 37 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన టీచర్లతో ప్రతిజ్ఞ చేయించి నివాస గణన మెటిరీయల్‌ను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌, ఆర్‌ఐలతో పాటు మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాలపై

అప్రమత్తంగా ఉండాలి

ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌

డిప్యూటీ చీఫ్‌ గౌరీశంకర్‌

పటాన్‌చెరు: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ గౌరీశంకర్‌ పేర్కొన్నారు. ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని న్యూలాండ్‌ యూనిట్‌–2 పరిశ్రమలో బుధవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా వ్యవహరించాలో కార్మికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హరిబాబు, న్యూలాండ్‌ యూనిట్‌–2 ప్లాంట్‌ హెడ్‌ మహేశ్‌ జోషి, సంస్థ సలహాదారు రామకృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ఎమ్మెల్యే సునీతారెడ్డి

కొల్చారం(నర్సాపూర్‌): ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని రంగంపేట, దుంపలకుంట చౌరస్తాలో చలివేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు సరిపోను లేవన్నారు. ధాన్యం రవాణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. ప్రధానంగా ధాన్యం లోడింగ్‌ చేసిన తర్వాత, లారీ ఏ రైస్‌మిల్‌కు వెళ్తుందన్న విషయమై రైతులకు చివరి వరకు తెలియడం లేదన్నారు. నిబంధనల పేరిట అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి, సజావుగా కొనుగోళ్లు, రవాణ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచిన రంగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని స్పందనను అభినందించారు. ఆమె వెంట తుక్కాపూర్‌, పైతర సర్పంచ్‌లు ఆంజనేయులు, రవితేజరెడ్డి, నాయకులు మల్లేశం, రాజా సంతోష్‌ కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement