హాస్టళ్ల సందర్శన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్ల సందర్శన తప్పనిసరి

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

సంగారెడ్డి జోన్‌: ప్రతీ అధికారి వారానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలను సందర్శించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సబ్‌డివిజన్‌, తహసీల్దార్‌, ఎంపీడీఓ, మిషన్‌ భగీరథ, హౌసింగ్‌, విద్యుత్‌ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..విద్యాసంస్థలు, వసతి గృహాల్లో మరమ్మతులు, పెయింటింగ్‌ వంటి పనులను గుర్తించి వెంటనే ప్రారంభించాలన్నారు. సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల డివిజనల్‌ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు 1916 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ చెప్పారు. వేసవిలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ఫీడర్‌ వారీగా పర్యవేక్షణ చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఫ్యామిలీ మెంబర్‌, జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారుల పక్కన చెత్త పేరుకుపోవడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనిపిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా..

జిల్లాలోని అన్ని రూట్లలో పరిధి ప్రారంభం, ముగింపు బోర్డులను స్పష్టంగా కనిపించేలా 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. నేషనల్‌ హైవే–65పై సరైన నిర్వహణ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

8న జాబ్‌ మేళా

తారా డిగ్రీ కళాశాలలో మే 8న నిర్వహించే జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్‌ మేళా పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. నేషనల్‌ హైవేలపై వేగ నియంత్రణ, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగంపై తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement
 
Advertisement
Advertisement