సేంద్రియ సాగుతోనే ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుతోనే ఆరోగ్యం

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

కొండాపూర్‌(సంగారెడ్డి): సేంద్రియ సాగుతో భూసారం పెరగడంతోపాటు మనుషుల ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుందని టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి తెలిపారు. కొండాపూర్‌లో మండలంలోని హరిదాస్‌పూర్‌లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి నిర్మలారెడ్డి హాజరయ్యారు. రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు, భూసార పరీక్ష ప్రాముఖ్యత, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు, ఎరువుల యాజమాన్యంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ అధికంగా ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల ఆహారం విషపూరితం అవుతుందన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ మాట్లాడుతూ..భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేస్తే ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు ప్రాముఖ్యత, దాని ద్వారా వచ్చే ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలను రైతులకు వివరించారు. రైతులు ఎల్లప్పుడూ అధీకృత డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, వాటి రశీదులను భద్రపరుచుకోవాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు శ్రీదేవి, లతీఫ్‌ పాషా, శాస్త్రవేత్తలు డా.గిరిజాదేవి, డా.జి.ప్రతిభ, డా.రవిశంకర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రభు, మాజీ ఎంపీటీసీ నర్సింహరెడ్డి, వైద్యనాథ్‌ ఏఓ గణేష్‌, ఏఈఓ రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement