మంత్రి వివేక్
పటాన్‌చెరు: పటాన్‌చెరులో రోడ్ల అభివృద్ధ్దికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వివేక్ తెలిపారు. పటాన్‌చెరులో ఆదివారం జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ కౌన్సిలర్లు మంత్రితో మాట్లాడుతూ...మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆ ప్రాంత సమస్యలను వివరించారు. కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ..పటాన్‌చెరులో గత పదేళ్లుగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధుల ఖర్చుపై విచారణ చేయాలని మంత్రికి విన్నవించారు. ఎమ్మెల్యే తన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లోకి తిరిగి చేరారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి సహకరించాలని మంత్రి వివేక్‌ను నీలం మధు కోరారు.
ఓ మంత్రి పోక.. మరో మంత్రి రాక
ప్రమాణ స్వీకారోత్సవంలో వింత పరిస్థితి కనిపించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి దామోదర్ హాజరయ్యారు. ఆయన వెళ్లి పోయిన తర్వాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ రావడం కార్యకర్తలను విస్మయానికి లోను చేసింది. దామోదర వెళ్లిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు కనిపించాయి. అంతలోనే వివేక్ రావడం, ఆయన తన ఉపన్యాసం ఇచ్చి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..పార్టీకి కష్టకాలంలో సైనికులుగా పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. దివంగత ప్రధాని ఇందిరమ్మ కారణంగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు చక్కటి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. పటాన్‌చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో దామోదరకు పట్టణంలో స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార వేదిక వరకు ర్యాలీ కొనసాగింది. మంత్రి దామోదర మాట్లాడి వెళ్లిన తర్వాత కార్యక్రమం ముగిసిందనుకుని అందరూ వెళ్లిపోయిన తర్వాత మరో మంత్రి వివేక్ వేదికకు చేరుకున్నారు. మొత్తం మీద ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం గందరగోళంగా ముగిసింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఎసీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, స్థానిక నేత నీలం మధు ముదిరాజ్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా పాల్గొన్నారు.


